జెనీవా: కరోనా మహామ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 1,83,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో 54,771 కేసులతో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉండగా.. 36,617 కేసులతో అమెరికా రెండో స్థానంలో, 15,400 కేసులతో భారత్ మూడో స్థానంలో ఉన్నది. టెస్టుల సంఖ్య పెరగడం, అధిక సంఖ్యలో వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో నమోదయిన కేసులతో కలుపుకుని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 87,08,008కు చేరగా.. నిన్న సంభవించిన 4,743 మరణాలతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 4,61,715కు చేరింది. నిన్నటి మరణాల్లో రెండింట మూడొంతుల మరణాలు అమెరికాలోనే సంభవించడం గమనార్హం.
స్పెయిన్‌లో అధికారులు మూడు నెలల లాక్‌డౌన్ తరువాత జాతీయ అత్యవసర పరిస్థితిని ముగించారు. ఫలితంగా మార్చి 14 నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొదటిసారిగా దేశ వ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రయాణించడానికి వీలు కల్పించారు. వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించే బ్రిటన్ సహా 26 యూరోపియన్ దేశాల సందర్శకుల కోసం విధించిన 14 రోజుల క్వారంటైన్ నియమాన్ని కూడా రద్దు చేశారు. అయితే ప్రస్తుతం ప్రయాణాలకు ప్రజలకు సుముఖంగా లేరు. ఈ క్రమంలో ‘ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన ఈ స్వేచ్ఛ వల్ల మేం మా కుటుంబాన్ని,స్నేహితులను చూడటానికి వెంటనే ప్రయాణం కావాల్సిన అవసరం లేదు. మరి కొంత కాలం ఎదురు చూస్తాం’ అని ప్రజలు వెల్లడిస్తున్నారు. స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ వైరస్ తిరిగి రాగలదని సెకండ్ వేవ్ అటాక్ చేసే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండమని ప్రజలను కోరారు. (కరోనాపై యోగాస్త్రం)
ఓక్లహోమాలోని తుల్సాలో జరిగిన ఒక ప్రచార ర్యాలీలో ట్రంప్ శనివారం మాట్లాడుతూ, అమెరికాలో 25 మిలియన్ల మందిని పరీక్షించామని.. అందువల్లే ఎక్కువ కేసులు వెలుగు చూశాయని తెలిపారు. ఇకమీదట చాలా నెమ్మదిగా కరోనా పరీక్షలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ట్రంప్‌కు అమెరికన్ ప్రజల భద్రత, ఆర్థిక శ్రేయస్సు కంటే రాజకీయాలే ముఖ్యమని డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్ ఆరోపించారు. జాన్స్ హాప్కిన్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయిన కరోనా కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది.
ఇప్పటి వరకు అమెరికాలో 2.2 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 1,20,000 మరణాలు సంభవించాయనినఈ నివేదిక తెలిపింది. అమెరికాలో కరోనా వైరస్ పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది. అరిజోనాలో శుక్రవారం 3,100 కొత్త కేసులు నమోదుకాగా.. రికార్డు స్థాయిలో తక్కువ సంఖ్యలో అనగా 26 మరణాలు సంభవించాయి. నెవాడాలో కొత్తగా 445 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ అమెరికాలో మాత్రమే కాకుండా బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో పాటు మరీ ముఖ్యంగా లాటిన్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. (ఈ ఏడాది హెచ్1బీ లేనట్లే)
ఆదివారం ఒక్క రోజే మొత్తం కేసుల సంఖ్య 50,000కు పైగా పెరిగిందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తమ దేశంలో దాదాపు 50,000 మరణాలు సంభవించాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కరోనా మరణాల్లో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాలో శనివారం ఒకే రోజు అత్యధికంగా 5,000 కొత్త కేసులు నమోదయ్యాయి.. 46 మంది మరణించారు. కేసుల సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా కఠినమైన లాక్‌డౌన్‌ను సడలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో క్యాసినోలు, బ్యూటీ సెలూన్లు, రెస్టారెంట్ సేవలు పునరుద్దరించారు. జర్మనీలోని ఒక మాంసం ప్యాకింగ్ ప్లాంట్‌లో 1,000కి పైగా కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వం మొత్తం 6,500 మంది కార్మికులు, నిర్వాహకులతో పాటు వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచింది.
చైనాలో 25 కేసులు నమోదు కాగా.. వీటిలో 22 కేసులు బీజింగ్‌లోనే వెలుగు చూశాయి. దక్షిణ కొరియాలో కూడా ఆదివారం కొత్త కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి. సియోల్‌లోని ఓ డోర్-టు-డోర్ సేల్స్ కంపెనీలో దాదాపు 200 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలీంది. వీటిలో 70 శాతం కేసులు అక్కడి టేబుల్ టెన్నిస్ క్లబ్‌తో ముడిపడి ఉన్నాయి. కానీ దక్షిణ కొరియా అధికారులు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కఠిన నియమాలను అమలు చేయడం లేదు. (బీజేపీ వల్లే దేశంలోకి కరోనా )
Comments
Please login to add a commentAdd a comment