'మూడువేలతో వచ్చాను.. అవే మిగిలినా ఓకే..'
ముంబయి: విలక్షణమైన నటనా ప్రతిభ కలిగిన అతికొద్ది మందిలో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్లో ఆయనది తిరుగులేని ప్రస్థానం. గొప్పగొప్ప పాత్రలు పోషించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన మనోగతాన్ని మీడియాతో పంచుకున్నారు. కేవలం రూ.3 వేలతో ముంబయిలో అడుగుపెట్టానని, వాటి ఆధారంగా తాను ప్రస్తుతం సంపాధించిన ఆస్తిమొత్తం పోతుందన్న బాధమాత్రం తనకు లేదని అన్నాడు. అవే మూడు వేలతో తిరిగి ఇంటికి వెళ్లిపోయినా పెద్దగా పట్టించుకోనని అన్నాడు. తాను నిర్మాతలను డబ్బుకోసం పెద్దగా డిమాండ్ చేయనని, తాను నటించే చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు చాలా తెలివైనవారని, తన నటనా సామర్థ్యాన్ని గుర్తించి వారే నిర్ణయిస్తారని అన్నారు.
'నేను డబ్బు కోసం డిమాండ్ చేయను. నా చిత్రాల నిర్మాతలు చాలా స్మార్ట్. వారికి నటులకు ఎంత చెల్లించాలో తెలుసు. నేను ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేస్తే అది వారు చెల్లించరు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి ఒక నటుడి సామర్థ్యం తెలుసు. నేను డబ్బు కోసం ఈ ఇండస్ట్రీకి రాలేదు. నాకు డబ్బే కావాలంటే మా ఊరు వెళ్లిపోయేవాడిని.. నాకు చాలా పొలం కూడా ఉంది. ఓ రైస్ మిల్ కూడా ప్రారంభించి ఉండేవాడిని' అంటూ ఆయన చెప్పుకొచ్చేవారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్(2012), ది లంచ్ బాక్స్ (2013), బద్లాపూర్ (2015)వంటి చిత్రాల్లో నవాజుద్దీన్ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.