వెండితెర సింధు?
‘‘ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బ్యాడ్మింటన్‌లో తొలిసారి సిల్వర్ మెడల్ సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ఘనత ప్రతి ఒక్కరికీ తెలియాలి. అందుకే ఆమె జీవితం ఆధారంగా సినిమా తీయాలనుకుంటున్నా’’ అని నటుడు సోనూ సూద్ అన్నారు. విలన్‌గా, సహాయ నటుడిగా దూసుకెళుతోన్న సోను ఆ మధ్య ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన ‘టుటక్ టుటక్ టుటియా’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఇప్పుడు పీవీ సింధు జీవితంతో సినిమా తీయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.
ఈ చిత్రం గురించి సోనూ సూద్ మాట్లాడుతూ – ‘‘సింధు సక్సెస్ జర్నీ గురంచి పరిశోధన చేస్తున్నాం. ప్రాక్టీస్ కోసం సింధు నిత్యం 50 కిలోమీటర్లు ప్రయాణం చేసేదని తెలుసుకొని షాక్ అయ్యాను. ఆమె గురించి కొన్ని కొత్త విషయాలు సేకరించిన తర్వాత మరింత ప్రేరణ పొందాను. దేశవ్యాప్తంగా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న ఈ సమయంలో బ్యాడ్మింటన్ ఛాంపియన్ సింధుపై బయోపిక్ తీయబోతుండటం ఆనందంగా ఉంది.
అందరూ అన్ని గేమ్స్‌ను సమంగా ఆదరించాలన్నదే నా అభిప్రాయం’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ బయోపిక్ గురించి తెలుసుకున్న సింధు.. ‘‘సోనూ సూద్ నా బయోపిక్‌ను ఎలా తీస్తారా? అని ఆసక్తిగా చూస్తున్నాను. ఈ సినిమా చాలామందికి ప్రేరణ కలిగించి, వారి కలలను నిజం చేసుకునేందుకు మార్గంగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
సింధు పాత్రలో దీపికా పదుకొనె యాక్ట్ చేయబోతున్నారని సమాచారం. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొనె బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అనే విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు దీపిక పలు మ్యాచ్‌లు ఆడారు. అందుకని ఈ చిత్రంలో ఆమె నటిస్తే, సింధు పాత్రకు న్యాయం చేస్తారని చెప్పొచ్చు.