ఐదుగురిలో...ఆ ముగ్గురూ ఎవరు?
ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్‌లో అడుగుపెట్టే ముహూర్తం ఎంతో దూరంలో లేదు. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని వినికిడి. జనరల్‌గా స్టార్ హీరోల సినిమాల్లో ఇద్దరు కథానాయికలు ఉండటం ఆనవాయితీ అయింది. ఇద్దరు నాయికలను సెలక్ట్ చేయడమే పెద్ద విషయం. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ చేయనున్న మూడు పాత్రల సరసన ముగ్గురు నాయికలను ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు. హీరోయిన్ల లిస్ట్‌లో మొత్తం ఐదుగురు నాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయట.
తమన్నా, రాశీఖన్నా, కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్, నివేథా థామస్.. ప్రధానంగా వీళ్లను అనుకుంటున్నారని సమాచారం. మరి, ఈ ఐదుగురిలో ఆ ముగ్గురూ ఎవరు అనేది వారం రోజుల్లో తెలిసిపోతుందని ఊహించవచ్చు. ఒకవేళ లిస్ట్‌లో లేని పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే... ఎన్టీఆర్ పక్కన నటించడానికి పలువురు కథానాయికలు సిద్ధంగా ఉన్నారు. కానీ, దర్శక, నిర్మాతలు బల్క్ డేట్స్ అడుగుతున్నారట. ఇప్పటికే అంగీకరించిన చిత్రాలు చేతిలో ఉండటంతో కథానాయికలు డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో రాయ్‌లక్ష్మి ఐటమ్ సాంగ్ చేయనున్నారనేది మరో ఖబర్. వచ్చే నెల 10న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. అప్పటికి ఐటమ్ భామపై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.