కొత్త సంవత్సరంలో బలమైన నిర్ణయం
కొత్త సంవత్సరంలో బలమైన నిర్ణయం
Published Wed, Jan 1 2014 12:00 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
‘‘ఈ ఏడాది నూతన దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటున్నా. అలాగే ‘చమేలీ’, ‘దేవ్’లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటున్నా. నాకు జోయా అక్తర్ సినిమాలంటే ఇష్టం. ఆమె దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఈ మధ్యకాలంలో హిందీలో విడుదలైన సినిమాలేవీ నేను చూడలేదు. అవన్నీ వరస పెట్టి చూడాలనుకుంటున్నా’’ అని కరీనా కపూర్ చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా కరీనా తీసుకున్న నిర్ణయాలివి.
అలాగే, మరో బలమైన నిర్ణయం కూడా తీసుకున్నారామె. అదేంటంటే, ఇప్పటివరకు యాభై చిత్రాలకు పైగా చేసినా, కరీనా పూర్తి స్క్రిప్ట్ చదవలేదట. జస్ట్ అలా అలా పైపైన చదివేసేదాన్నని కరీనా పేర్కొన్నారు. అందుకే, ఇక నుంచి ప్రతి పేజీ చదివిన తర్వాతే ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారామె. కొత్త సంవత్సరం సందర్భంగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు... ఎక్కడ జరుపుకోవాలో కూడా నిర్ణయించేసుకున్నారు కరీనా. ఈ బ్యూటీకి స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం. ఈసారి స్విస్‌లోనే తన భర్త సైఫ్‌తో కలిసి న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. స్విస్‌లోని స్టాడ్ అనే ప్లేస్ అంటే ఈ జంటకు చాలా ఇష్టం.
స్టాడ్‌లో ప్రతి ఏడాదీ ఒకే హోటల్లో, ఒకే నంబర్ గదిలో ఈ జంట బస చేస్తుంటారు. ఈసారి కూడా అలానే చేయబోతున్నారు. భవిష్యత్తులో స్టాడ్‌లో ఓ ఇల్లు కూడా కొనుక్కోవాలనుకుంటున్నారు. కరీనాకు కొత్త సంవత్సరంలో ఓ కొత్త కాంట్రాక్ట్ దక్కింది. అత్యధిక పారితోషికంతో ఓ పాకిస్తానీ వాణిజ్య ప్రకటన కాంట్రాక్ట్ ఆమెను వరించింది. పాకిస్థాన్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే క్యూ మొబైల్ ఫోన్‌కు ప్రచారకర్తగా కరీనా వ్యవహరించనున్నారు. ఈ విధంగా కరీనా పాపులార్టీ దేశం దాటి పక్క దేశాలకు కూడా వ్యాపించడం సైఫ్ అలీఖాన్‌కు ఎంతో సంబరాన్ని కలిగిస్తోంది.
Advertisement
Advertisement