ముంబయి: స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హిట్లు లేకున్నా నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ ఐకాన్ గా పేరున్న ఈ బ్యూటీ వివాహం ఎప్పుడంటూ ఆమెకు ఎదురైన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చింది. కేవలం హీరోయిన్లనే ఎందుకు టార్గెట్ చేస్తారు. మాకంటూ వ్యక్తిగత జీవితం ఉండదా అంటూ ప్రశ్నించింది. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైతే ముందుగా అందరికీ వెల్లడించి ఆ తర్వాతే వివాహం అని గతంలో చెప్పిన విషయాన్ని మళ్లీ గుర్తుచేసింది సోనమ్.
వివాహం ఎప్పుడూ అంటూ హీరోయిన్లను అడుగుతున్నందుకు నాకేం ఇబ్బంది లేదు. కానీ కేవలం హీరోయిన్లను మాత్రమే ఈ ప్రశ్న అడగటమే తనకు నచ్చదని చెప్పింది. దమ్ముంటే.. హీరోలు రణ్‌బీర్ కపూర్, రణవీర్ సింగ్‌లను ఈ ప్రశ్న ఎప్పుడైనా అడిగారా.. లేకపోతే ఎందుకు అడగలేక పోతున్నారో చెప్పాలని ఘాటుగా స్పందించింది ఈ బ్యూటీ. ‘వివాహంతో ఏదీ మారదు. క్యాలెండర్‌లో అంకెలు తప్ప. నర్గీస్, వహీదా రెహమాన్, షర్మిలా ఠాగూర్, డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, కాజోల్, కరీనా కపూర్.. ఇలా ఎంతో మంది నటీమణులు పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభి తాము ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకున్నారంటూ’ నటి సోనమ్ చెప్పుకొచ్చింది. లేటెస్ట్ సినిమాలు 'పాడ్‌మాన్', ‘వీర్ డి వెడ్డింగ్’ పనుల్లో ఆమె బిజీబిజీగా ఉంది.
ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజా, సోనమ్ కపూర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. డేటింగ్ చేస్తున్న ఈ జంట పలు పార్టీలు, ఈవెంట్లకు కలిసి వెళ్తోంది. అయితే తమ ప్రేమ వ్యవహారంపై నోరు మాత్రం మెదపడం లేదన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment