అలాంటి విలన్ పాత్ర చేయాలని ఉంది
‘‘రిస్క్‌లు తీసుకోవడానికి ఎప్పుడు రెడీ’’ అంటున్నారు విశాల్. మంచి మాస్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ బాల దర్శకత్వంలో ‘వాడు వీడు’లో ప్రయోగాత్మక పాత్ర చేశారు. బాల దర్శకత్వంలో వచ్చే ఏడాది మరో సినిమాచేయనున్నారు. మళ్లీ శరీరాన్ని కష్టపెట్టుకోనున్నారన్నమాట? అంటే... ‘‘కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది.నటుడిగా నా ఆత్మసంతృప్తి కోసం ఎంతకష్టపడటానికైనా వెనకాడను’’ అన్నారాయన.నేడు విశాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన మనోభావాలు ఇలా పంచుకున్నారు.
ప్రస్తుతం ‘పూజై’ అనే చిత్రంలో నటిస్తున్నాను. తెలుగులో ‘పూజ’గా విడుదల కానుంది. శ్రుతీ హాసన్ కథానాయిక. ఆమె చాలా టాలెంటెడ్. ఈ సినిమా కోసం శ్రుతి తెలుగు, తమిళ భాషల్లో ఓ పాట పాడింది. అలాగే, రెండు భాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతోంది. రెండు భాషల్లోనూ దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నాం.
సుందర్. సి దర్శకత్వంలో ‘ఆంబలై’ అనే చిత్రం చేస్తున్నా. నా కెరీర్‌లో ఆరుగురు కథానాయికలతో చేస్తున్న సినిమా ఇదే. రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, హన్సిక, మధురిమ నటిస్తున్నారు. ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. సుందర్ స్టయిల్‌లో సాగే మాస్ ఎంటర్‌టైనర్ ఇది.
తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. మా అమ్మా, నాన్నల కోరిక కూడా అదే. ఆ కోరిక ఈ ఏడాది తీరుతుంది. శశికాంత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. నవంబర్‌లో షూటింగ్ ఆరంభమవుతుంది.
నాకు నచ్చిన దర్శకుల్లో రామ్‌గోపాల్‌వర్మ ఒకరు. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే దర్శకుణ్ణి కావాలనుకున్నా. గతంలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. హీరో అయిన తర్వాత దర్శకత్వం గురించి ఆలోచించడంలేదు. భవిష్యత్తులో డెరైక్షన్ చేస్తానేమో. ఈలోపు ప్రతిభ గల అసిస్టెంట్ దర్శకులను నా సంస్థ ద్వారా దర్శకులుగా పరిచయం చేయాలని ఉంది. నా బేనర్లో ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తా. ఇటీవలే ‘వి మ్యూజిక్’ పేరుతో ఓ ఆడియో కంపెనీ ఆరంభించాను. నా చెల్లెలు ఐశ్వర్య ఆధ్వర్యంలో ఆ కంపెనీ సాగుతోంది.
నాకెప్పట్నుంచో ప్రతినాయకునిగా నటించాలని ఉంది. హాలీవుడ్ చిత్రం ‘డార్క్ నైట్’లోని జోకర్ తరహా నెగటివ్ రోల్ చేయాలని ఉంది. పైకి బఫూన్‌లా కనిపించినా, లోపల కరడుగట్టిన వ్యక్తి జోకర్. పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్ర అది. అలాంటి పాత్రకు అవకాశం వస్తే.. వెంటనే ఒప్పేసుకుంటా.