
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దును ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ను, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. దాద్రా నగర్ హవేలిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడుతోందని, రాహుల్ గాంధీ ఇచ్చే ప్రకటనలను పాకిస్తాన్ స్వాగతిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌కు కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఉపకరించడం సిగ్గుచేటని అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై పార్టీలకు అతీతంగా నేతలంతా ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాలని షా పిలుపు ఇచ్చారు. జమ్ము కశ్మీర్ భారత్‌లో పూర్తిగా మమేకమయ్యేందుకు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) అవరోధంగా ఉన్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు రెండోసారి అఖండ మెజారిటీతో పట్టం కట్టిన కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగలిగిందని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధికి దారిచూపుతుందని చెప్పారు. కొద్దిమంది మినహా ప్రభుత్వ చర్యను పౌరులందరూ స్వాగతించారని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment