సాక్షి, ముంబయి : వ్యవసాయ సంక్షోభాన్ని సర్కార్ దృష్టికి తీసుకువచ్చేందుకు మహారాష్ట్ర రైతులు 180 కిమీ మహా పాదయాత్రతో ముంబయి తరలిరావడం పలువురిని ఆకట్టుకుంటోంది. మహా యాత్ర చేపట్టిన రైతులకు బాలీవుడ్ సంఘీభావం తెలిపింది. బోర్డు పరీక్షలు జరుగుతున్న విద్యార్ధులకు అంతరాయం కలుగకుండా అర్ధరాత్రి సైతం అడుగులో అడుగేస్తూ ఆజాద్ మైదానం చేరుకోవడం తమలో స్ఫూర్తి నింపిందని బాలీవుడ్ నటులు పేర్కొన్నారు. రైతుల స్ఫూర్తికి సలాం అంటూ రితీష్ దేశ్‌ముఖ్, దియా మీర్జా, ఒనీర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు బాసటగా నిలిచారు.
తమ పంటలకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోరుతూ రైతులు 180 కిమీ నడిచారని, యాత్ర చివరిలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు అంతరాయ కలుగకుండా రాత్రంతా నడిచి నగర విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చేశారని రితీష్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు. రైతులకు శాల్యూట్ అంటూ జై కిసాన్ అని నినదించారు. మనకు అన్నం పెట్టేందుకు రైతులు ప్రతికూల వాతావరణంలోనూ పనిచేస్తారని, వారికి దళారీలు, మద్దతు ధర కొరవడటం బాధాకరమని నటి దియా మీర్జా అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే రాజకీయ ర్యాలీలకు భిన్నంగా రైతులు స్ఫూర్తివంతంగా వ్యవహరించారని ఒనిర్ కొనియాడారు. ప్రకాష్ రాజ్, మాధవన్, పూరీ జగన్నాధ్, సిద్ధార్ధ బసు, శ్రుతి సేథ్, ప్రితీష్ నంది వంటి సెలబ్రిటీలు రైతులకు సంఘీభావం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment