కిషోరీ యోజన రద్దు వెనుక సీబీఐ అధికారి?
ఇటీవల ఢీల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకునే నిర్ణయాలన్నీ వార్తల్లోకెక్కుతుండటంతో ఆయన చేసే ప్రతి పనిని జనం సునిశితంగా గమనిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని సర్కారు బడుల్లో అమల్లో ఉన్న కిషోరీ యోజన కార్యక్రమాన్ని నిలిపివేయడంపై స్థానిక మీడియా దృష్టి పెట్టింది. ఢిల్లీ స్కూళ్లలోని సుమారు 7.5 లక్షలమంది విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లు అందించే సౌకర్యాన్ని రద్దు చేయడం వార్తల్లో కెక్కింది. నాప్కిన్లు అందించే సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అగ్రిమెంటును సీబీఐ అధికారి ఒకరు తీసుకోవడంతోనే సర్కారు ఈ సౌకర్యాన్నిరద్దుచేసిందంటూ వచ్చిన వార్తలకు కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. సీబీఐ అధికారి రాజీందర్‌కు, కంపెనీకి సంబంధం ఏమిటంటూ ట్వీట్ చేశారు.
ఢిల్లీ విద్యార్థినులకు కిషోరీ స్కీమ్ ద్వారా 2012 నుంచి ప్రభుత్వం ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందజేస్తోంది. అయితే సదరు కంపెనీ కాంట్రాక్టును ఢిల్లీ సర్కారుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి... సీబీఐ అధికారి తీసుకోవడమే విద్యార్థులకు అందించే సౌకర్యాన్ని నిలిపివేయడానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఈ సౌకర్యాన్ని ఇకపై నిలిపివేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ నుంచి ఇకపై విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందవన్న వివరాలతో మార్చి 2న ఢిల్లీ విద్యా శాఖకు చెందిన కేర్ టేకింగ్ బ్రాంచ్ కు ఓ లేఖ అందింది. ఇప్పటివరకు లక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ లక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ కు కూడా సదరు నిర్దేశాలు జారీచేస్తూ లేఖ పంపింది. అయితే ఢిల్లీ సర్కార్ లోని సీబీఐకి చెందిన దినేష్... సదరు కంపెనీ కాంట్రాక్ట్ ను తీసుకోవడంతోనే ఈ కిషోరీ యోజన కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది.
కొన్నేళ్లుగా నిర్విరామంగా, నిర్వివాదంగా, ఎటువంటి సమస్యలు లేకుండా నడుస్తున్న కిషోరీ యోజనా కేవలం సీబీఐ అధికారి చేతుల్లోకి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కాంట్రాక్టు వెళ్ళడంతోనే రద్దు అయినట్లు తెలుస్తోంది. సదరు సీబీఐ అధికారి సర్కారు బడులకు నాప్కిన్ల సరఫరా నిలిపివేయమంటూ ఆదేశించడంతోనే ఈ పథకం నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఇటీవల విద్యా సంస్థల విషయంలో అనేక సరికొత్త నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. సాఫీగా కొనసాగుతున్న పథకాన్ని నిలిపివేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో స్పందించిన కేజ్రీవాల్.. వార్తల వెనుక కథను పరిశీలించే పనిలో పడ్డారు.