
మంత్రులకు కొత్త సీఎం 15 రోజుల గడువు
లక్నో: కాన్షీరాం స్మృతి ఉప్వన్లో ఆదివారం యూపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ మంత్రులకు కొన్ని విషయాలను ఉపదేశించారు. ఆ విషయాలను యూపీ రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ లక్నోలో మీడియా సమావేశంలో వెల్లడించారు. యూపీ రాష్ట్ర మంత్రులందరూ తమకు సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశించినట్లు చెప్పారు. కేవలం 15 రోజులు గడువులోగా సీఎం కార్యదర్శి, సంబంధిత ఉన్నతాధికారులలో ఎవరికైనా మంత్రులు తమ ఆస్తుల పూర్తి సమాచారాన్ని అందించాలని సీఎం సూచించినట్లు శ్రీకాంత్ శర్మ వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిన వెంటనే వేడుకలు, ఆర్భాటాలు చేస్తూ ఎవరికీ ఇబ్బంది కలిగించ వద్దని తన మద్దతుదారులను హెచ్చరించిన యోగి.. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత.. అనవసర వ్యాఖ్యలు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిదని కేబినెట్ మంత్రులకు సూచించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా నడుచుకోవద్దని, అది ఎవరికీ మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ వివరించారు. కొత్త సీఎం యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర ప్రముఖులు హాజరయిన విషయం తెలిసిందే.