న్యూఢిల్లీ: కరోనా భయాల నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ తీవ్రత తగ్గేవరకు ముఖ్యమైన కేసులను మాత్రమే విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టుకు వచ్చే ప్రజలు, సిబ్బంది, జడ్జిల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కోర్టు విధులకు కొంత పరిమితి విధించినట్టు వెల్లడించింది. ఈమేరకు సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్.కల్గాంకర్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
(చదవండి: ఆస్ట్రేలియా హోంమంత్రికి కరోనా పాజిటివ్)
కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సూచనలు, ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో సీజేఐ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు గుంపులుగా ఉండొద్దనే ఆరోగ్య శాఖ సూచనల మేరకు.. కోర్టు రూముల్లో ప్రవేశానికి ఆంక్షలు విధించినట్టు చెప్పారు. న్యాయవాదులు, పిటిషనదారుడు, ప్రతివాదిని మాత్రమే కోర్టు హాల్లోకి అనుమతిస్తామని సంజీవ్ ఎస్.కల్గాంకర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అన్ని బెంచ్‌లు విడివిడిగా పనిచేస్తాయని తెలిపారు. కోర్టు నిర్ణయం మేరకు సిబ్బందితో అందరూ సహకరించాలని కోరారు. ఇక సుప్రీం కోర్టు ఇప్పటికే హోలీ సెలవుల్లో ఉండటంతో తాజా నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.
(చదవండి: కరోనా ఎఫెక్ట్.. ఇక నమస్తే విశ్వవ్యాప్తం)
Comments
Please login to add a commentAdd a comment