
ఉద్యోగికి ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మధ్య తరగతిని కేంద్రం మరచిపోలేదు. ఎన్నికల్లో గెలిచాక నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్లో మధ్య తరగతి జీవులకు ఊరటనిచ్చేలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను కనీస మినహాయింపు పరిమితిని (బేసిక్ లిమిట్) ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ల విషయంలోనైతే ఈ మినహాయింపు ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. అది రూ.3 లక్షలకు చేరుతుంది. అలాగే గృహరుణాలకు చెల్లించే వడ్డీపై లభించే పన్ను ప్రయోజనాలను రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. పన్ను శ్లాబుల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. ‘‘బేసిక్ లిమిట్ పరిమితిని అదనంగా రూ. 50,000 పెంచుతున్నాం’’ అని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి జేబులోనూ కనిష్టంగా రూ.5,000 మిగులుతాయి. సుమారు రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.
పెరిగిన సేవింగ్స్ పరిమితి
వివిధ పొదుపు పథకాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్, వ్యయాలపై లభించే పన్ను మినహాయింపుల పరిమితిని పెంచుతూ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 80సీ ద్వారా లభించే పన్ను మినహాయింపుల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. జీవిత బీమా ప్రీమియంలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్), ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి పొదుపు పథకాలతో పాటు ట్యూషన్ ఫీజులు గృహరుణాలకు చెల్లించే అసలు (ప్రిన్సిపల్) వంటి వ్యయాలు ఈ సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ పరిధిని పెంచడంతో మరో రూ.50,000పై పన్ను ప్రయోజనాలను పొందచ్చు. దీనివల్ల పన్ను శ్లాబులను బట్టి కనిష్టంగా రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది.
గృహరుణ దారులకు ఊరట
గృహ రుణం తీసుకొని ఆ ఇంట్లో నివసించే తాము తీసుకున్న రుణానికి గాను ఈఎంఐలు చెల్లిస్తుంటారు. దీన్లో అసలు కొంత, వడ్డీ కొంత ఉంటుంది. అసలు మొత్తానికి సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుండగా... వడ్డీకి మాత్రం సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపు ఉంటోంది. ఇప్పటిదాకా ఈ మినహాయింపు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ మాత్రమే వర్తించేది. దీన్ని రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం లభించనుంది.
పీపీఎఫ్ పరిమితి పెంపు
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ పథకాలను ప్రోత్సహించే విధంగా ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకంలో ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పెట్టే పెట్టుబడులు సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు 2011లో నిలిపివేసిన కిసాన్ వికాస్ పత్రాలను తిరిగి ప్రవేశపెట్టారు.
డీటీసీని సమీక్షిస్తున్నాం..
డెరైక్ట్ ట్యాక్స్ కోడ్‌ను (డీటీసీ) సమీక్షిస్తున్నామని, ఈ ఏడాది చివరికల్లా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. చాలా సంక్లిష్టంగా ఉన్న 60 ఏళ్ల నాటి ప్రస్తుత ఇన్‌కమ్ ట్యాక్స్ స్థానంలో సులభతరంగా ఉండే డీటీసీని ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. డీటీసీ బిల్లును 2010లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అప్పటి ప్రతిపక్ష నేత యశ్వంత్ సిన్హా నాయకత్వంలో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డీటీసీపై వచ్చిన సూచనలు సలహాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని జైట్లీ పేర్కొన్నారు.
రూ. 22 వేల కోట్ల ఆదాయ నష్టం
ప్రత్యక్ష పన్నుల్లో చేసిన మార్పులతో భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆదాయ పన్ను సవరణలతో పాటు ఇతర ప్రత్యక్ష పన్నుల్లో చేసిన మార్పుతో రూ.22,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు చెప్పారు.
ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు
బేసిక్ లిమిట్ రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు
ఈ నిర్ణయంతో జేబులోకి అదనంగా రూ.5,000
రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట
సెక్షన్ 80సీ పరిమితి రూ.1 లక్ష నుంచి 1.5 లక్షలకు గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు
రూ.1.5 లక్షల నుంచి 2 లక్షలకు..
ఈ నిర్ణయంతో గరిష్టంగా 15వేల వరకూ ప్రయోజనం