రాహుల్ వస్తున్నారు.. అంత్యక్రియలు ఆపండి!
రాహుల్ వస్తున్నారు.. అంత్యక్రియలు ఆపండి!
Published Fri, Nov 4 2016 9:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
పెన్షన్ విషయమై ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడు రాంకిషన్ గ్రెవాల్ అంత్యక్రియల సమయంలో కాసేపు పొలిటికల్ డ్రామా జరిగింది. వాస్తవానికి నాయకులు ఎవరూ రాకపోయినా తగిన సమయంలోనే తాము అంత్యక్రియలు చేద్దామని కుటుంబ సభ్యులు భావించారు. అందుకోసం గ్రెవాల్ మృతదేహానికి స్నానాలు కూడా చేయించారు. కానీ.. రాహుల్ గాంధీ వస్తారని, అప్పటివరకు అంత్యక్రియలు ప్రారంభించొద్దని కాంగ్రెస్ కార్యకర్తలు వారిని ఆపారు. ఉదయం 10.45 గంటల సమయంలో రాహుల్ గాంధీ అక్కడకు చేరుకున్నారు. కొద్ది నిమిషాల పాటు గ్రెవల్ ఇంటివద్ద ఉండి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, అక్కడి నుంచి శ్మశానవాటికకు వెళ్లారు. రాహుల్ గాంధీ వచ్చేశారు కాబట్టి ఇక అంత్యక్రియలు చేస్తారనుకుంటున్న తరుణంలో.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో అంత్యక్రియలు జరగాలని కుటుంబ సభ్యులు భావించారు. దాంతో రాహుల్ కాసేపు అక్కడే వేచి ఉన్నారు. భివానీలోని శ్మశానవాటిక వద్దకు కేజ్రీవాల్ వచ్చేవరకు అరగంట పాటు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ కాలక్షేపం చేశారు.
మధ్యాహ్నం సమయానికి అరవింద్ కేజ్రీవాల్ అక్కడకు చేరుకున్నారు. ఆయన వచ్చిన కొద్ది నిమిషాల తర్వాత గ్రెవాల్ పెద్దకొడుకు దిలావర్ తన తండ్రి చితికి నిప్పంటించారు. రాహుల్, కేజ్రీవాల్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కూడా గ్రెవాల్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బల్మా గ్రామానికి వెళ్లారు. వీళ్లంతా కూడా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని అమలుచేయలేదంటూ ప్రధాని మోదీని విమర్శించినా.. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరదూరంగా ఉన్నారు. చితికి నిప్పంటించిన కొద్ది క్షణాలకే అక్కడినుంచి బయల్దేరదామని రాహుల్ భావించినా, కుటుంబ సభ్యులతో కాసేపు గడుపుదామని మళ్లీ తిరిగి వచ్చారు.
Advertisement