మెరుపుల్లేవ్.. మరకలూ లేవ్ | No Magic.. No threat to common Man in Budget-2014 | Sakshi
Sakshi News home page

మెరుపుల్లేవ్.. మరకలూ లేవ్

Published Fri, Jul 11 2014 2:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

మెరుపుల్లేవ్.. మరకలూ లేవ్ - Sakshi

మెరుపుల్లేవ్.. మరకలూ లేవ్

  • సాదాసీదాగా మోడీ సర్కారు తొలి బడ్జెట్
  •   శాయశక్తులా చాణక్యం ప్రదర్శించిన జైట్లీ
  •   ‘నొప్పింపక, తానొవ్వక’ రీతిలో గణాంక గారడీ
  •   ఆదాయపు పన్ను మినహాయింపు పరిధి పెంపు
  •   తగ్గిన రోజువారీ వినియోగ వస్తువుల ధరలు
  •   సిగరెట్లు, కూల్‌డ్రింక్స్ తదితరాలపై బాదుడు
  •   యూపీఏ ఫ్లాగ్‌షిప్ పథకాల కొనసాగింపు
  •   దేశీ, విదేశీ పెట్టుబడుల సాధనే లక్ష్యమన్న జైట్లీ
  •  
     న్యూఢిల్లీ: మోడీ సర్కారు తొలి బడ్జెట్ ఫర్వాలేదనిపించింది. వహ్వా అన్పించే రీతిలో జనాకర్షక విన్యాసాలు గానీ, మెరుపులు గానీ లేవు. అలాగని జనంపై మోయలేని భారాలూమోపలేదు. నొప్పింపక, తానొవ్వక అన్న రీతిలో చేతనైన మేరకు చాణక్యం చూపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నించారు.  2014-15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి సాధారణ బడ్జెట్‌ను గురువారం ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను కనీస మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచడమే గాక దానికి మరిన్ని పన్ను మినహాయింపు లనూ జోడించి మధ్యతరగతి వర్గాన్ని కాస్తంత మురిపించారు. అగ్గిపెట్టెలు మొదలుకుని టీవీలు, కంప్యూటర్ల దాకా పలు రకాలైన రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాలను ఓ మేరకు తగ్గించారు. అదే సమయంలో సిగరెట్ల నుంచి శీతల పానీయాల దాకా పలు ఉత్పత్తులపై ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలో పన్నుల మోత మోగించారు. చీటికీమాటికీ పన్ను విధానాలను మార్చబోమనే హామీతో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు సానుకూల సంకేతాలు పంపారు. పన్ను చట్టాలకు ‘గతం నుంచి అమల్లోకి వచ్చేలా’ (రెట్రాస్పెక్టివ్) సవరణలు చేసే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటామంటూ వారికి హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పూర్తిస్థాయిలో పట్టాలకెక్కించేందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకున్నట్టు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం పీటీఐ వార్తా సంస్థతో జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని పట్టాలకెక్కిస్తామన్నారు. వస్తువులు, సేవల పన్ను విధివిధానాలను కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
     
     పథకాల కొనసాగింపు...
     యూపీఏ హయాంలో మొదలైన జాతీయ ఉపాధి హామీ తదితర ఫ్లాగ్‌షిప్ పథకాలను మోడీ సర్కారు యథాతథంగా కొనసాగించింది. వాటిలో కొన్ని పథకాలకు నిధులను తగ్గించగా మరికొన్నింటికి యథాతథంగా కొనసాగించింది. వ్యవసాయ రంగానికి తమ సర్కారు ప్రాధాన్యమిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్లతో డీడీ కిసాన్ చానల్‌ను ప్రకటించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ తరహా సంస్థలను ప్రకటించారు. గ్రామీణ భారతాన్ని ఆధునిక బాట పట్టిస్తామన్నారు. ఇందుకోసం డిజిటల్ ఇండియా వంటి పలు పథకాలు ప్రకటించారు. చిన్న మొత్తాల పొదుపును ఇతోధికంగా ప్రోత్సహిస్తాం. కిసాన్ వికాస్ పత్రాలను మళ్లీ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. మోడీ కలల ప్రాజెక్టు గంగా నది ప్రక్షాళనకు పెద్ద పీట వేశారు. అందరికీ ఆరోగ్యమే సర్కారు లక్ష్యమన్నారు.
     
     పెరిగిన ప్రణాళికా వ్యయం
     మొత్తం రూ.17,94,892 కోట్లతో కూడిన 2014-15 బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ.12,19,892 కోట్లుగా ఉండొచ్చని జైట్లీ అంచనా వేశారు. అయితే ప్రణాళికా వ్యయం వాటా గతంతో పోలిస్తే 26 శాతం పెరిగి రూ.5.75 లక్షల కోట్లకు చేరింది. ఇది సానుకూల పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రక్షణ, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి తమ సర్కారు పెంచుతోందని మంత్రి చెప్పారు. కాకపోతే ఆయా రంగాలు పూర్తిగా స్వదేశీ నిర్వహణ, నియంత్రణలోనే కొనసాగుతాయని హామీ ఇచ్చారు. కీలకమైన రక్షణ రంగానికి బడ్జెట్లో రూ.2.29 లక్షల కోట్లు (గత కేటాయింపులతో పోలిస్తే 12.5 శాతం అధికం) కేటాయించారు. స్థూల పన్ను వసూళ్లను రూ.13,64,524 కోట్లుగా అంచనా వేశారు. ‘‘ఇందులో కేంద్రం వాటా రూ.9,77,258 కోట్లు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.2,12,505 కోట్లుగా ఉండవచ్చు’’ అని మంత్రి అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 4.1 శాతం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అది 2015-16లో 3.6 శాతం, 2016-17లో 3 శాతానికి పరిమితమవుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనల ద్వారా రూ.22,200 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోనున్నామని, అదే సమయంలో పరోక్ష పన్ను ప్రతిపాదనలు రూ.7,525 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించి పెట్టనున్నాయని తెలిపారు. ‘‘మేం అధికారంలోకి వచ్చి 45 రోజులే అయింది. గత ప్రభుత్వం విధించుకున్న లక్ష్యాల కారణంగా తలెత్తిన పరిమితులకు లోబడి, ఈ స్వల్ప కాలంలో మేం చేయగలిగిందంతా చేశాం’’ అని చెప్పుకొచ్చారు. సబ్సిడీ వ్యవస్థను పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో అణగారిన, బలహీనవర్గాల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. సబ్సిడీ సంస్కరణలను పరిశీలించేందుకు వ్యయ నిర్వహణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సకాలంలో విధాన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే వరుసగా రెండేళ్ల పాటు ఆర్థిక వృద్ధి రేటు 5 శాతం కంటే దిగువకు పడిపోయిందంటూ యూపీఏ ప్రభుత్వాన్ని జైట్లీ విమర్శించారు.
     
     రూ.6 లక్షల కోట్ల అప్పులు తెస్తాం: జైట్లీ
     ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి, గత రుణాలను తీర్చడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6 లక్షల కోట్ల దాకా రుణాలను సేకరించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. గతేడాది ఇది రూ.5.63 లక్షల కోట్లు. గత రుణాలు, వడ్డీల చెల్లింపులకు పోను నికరంగా రూ.4,61,204 కోట్ల రుణాలను సేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. 2013-14తో పోలిస్తే ఇది రూ.7,700 కోట్లు తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రూ.3.68 లక్షల కోట్ల రుణాలు సేకరిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 24 పైసలు మార్కెట్ నుంచి అప్పు రూపంలోనే సమకూరనుంది. ఇందులో 20 పైసలు వడ్డీల చెల్లింపుకే వెళ్తుంది.  కేంద్ర ప్రణాళికా కేటాయింపులు ప్రతి రూపాయిలో 21 నుంచి 11 పైసలకు తగ్గాయి. నిరుడు 18 పైసలు న్న వడ్డీ చెల్లింపులు 20 పైసలకు పెరుగుతాయి. 
     
     ఇది సవాలే.. అధిగమిస్తాం
     ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, మందగమనంతో కూడిన వృద్ధి నిజంగా సవాళ్లేనని జైట్లీ అన్నారు. ఈ పరిస్థితిని అధిగమిస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. ‘ఆశించిన వృద్ధి, అల్ప ద్రవ్యోల్బణం, రంగాలవారీగా అభిలషణీయ సమతౌల్యం, సమర్థమైన విధాన వైఖరులతో కూడిన వ్యవస్థను నెలకొల్పుతాం’ అని ప్రకటించారు. అయితే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ, ఉపాధి కల్పన దిశగా బడ్జెట్‌లో ఎన్నో చర్యలు తీసుకున్నామ న్నారు. హైవేల ఆధునీకరణకు రూ.38 వేల కోట్లు వెచ్చించనుండటానికి ఇదో కారణమన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల నుంచి దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (ఆర్‌ఈఐటీ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్‌లకు రూపకల్పన చేసి పన్ను రాయితీలు కల్పిస్తున్నామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement