ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ఓ వైపు కుటుంబంలో తీవ్ర విషాదం. మరోవైపు ఓ ప్రాణం చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. రెండింటిలో ఏది ముఖ్యమంటే... తన వృత్తి ధర్మమే ముఖ్యమని ఆయన నిర్ణయించుకున్నాడు.
ఉత్తర ప్రదేశ్ షారన్‌పూర్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ భూపేంద్ర తోమర్(57) ఫిబ్రవరి 23న బడాగావ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంతలో సర్‌సిరి గ్రామంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పొడిచారని.. రక్తపు మడుగులో అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైర్‌లెస్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఆయన తన వాహనాన్ని ఘటనా స్థలం వైపు తిప్పారు. ఆ సమయంలో ఆయనతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఇంతలో ఆయనకు మరో కాల్ వచ్చింది.
ఆయన కూతురు జ్యోతి హఠాన్మరణం చెందిందని ఆ వార్త సారాంశం. ఓ వైద్య కేంద్రంలో సహయకురాలిగా పని చేసే కూతురికి ఏడాది క్రితమే ఆయన వైభవంగా వివాహం చేసి పంపించారు. అలాంటిది ఉన్నట్లుండి ఆమె చనిపోయిందన్న వార్తతో ఆయన ఉలిక్కిపడ్డారు. అయినా తన వాహనాన్ని వెనక్కి తిప్పకుండా.. వాహనాన్ని క్షతగాత్రుడి వైపునకు వెళ్లారు. ఆంబులెన్స్ ఆలస్యం కావటంతో తమ వాహనంలోనే తీసుకెళ్లి అతని ప్రాణాలను పోలీసులు కాపాడగలిగారు.
‘ నా కూతురి మరణ వార్త తెలిశాక నేను బాధపడటం తప్పించి చెయ్యగలిగింది ఏం లేదు. ఆ సమయంలో ఓ వ్యక్తి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. అందుకే అతన్ని కాపాడాలన్న నిర్ణయంతో ముందుకు వెళ్లా ’ అని భూపేంద్ర చెబుతున్నారు. పిడుగులాంటి వార్త తెలిశాక కూడా వృతి ధర్మంతో ఓ ప్రాణం కాపాడిన భూపేంద్రను పోలీస్ శాఖ ఘనంగా సన్మానించింది.
భూపేంద్రను సన్మానిస్తున్న ఉన్నతాధికారులు
Comments
Please login to add a commentAdd a comment