మోదీ వీడియోకాన్ఫరెన్స్‌.. ఏం చెబుతారో? | PM Modi Meeting: Why States Were Divided Into Two Groups | Sakshi
Sakshi News home page

మోదీ భేటీ; రెండు గ్రూపులు ఎందుకు?

Published Mon, Jun 15 2020 8:10 PM | Last Updated on Mon, Jun 15 2020 9:02 PM

PM Modi Meeting: Why States Were Divided Into Two Groups - Sakshi

సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ (ఫైల్‌)

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16, 17 తేదీల్లో సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గురించి ఆయన చర్చించనున్నారు. మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా ఆయన సంభాషించనున్నారు. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఈ 21 రాష్ట్రాల్లో దాదాపు 5 శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. 

కరోనా వైరస్ కేసుల పెరుగుదల, రాష్ట్రాల భౌగోళిక స్థానాల ఆధారంగా రాష్ట్రాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ జాబితాను ప్రధానమంత్రి కార్యాలయం గతవారం ట్విటర్‌లో షేర్‌ చేసింది. మొదటి రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వతప్రాంత రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు అసోం(4049), పంజాబ్‌(3140), కేరళ(2461)లలో నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదివారం నాటికి ఈ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన మొత్తం క్రియాశీల కేసులు18,000 లోపు ఉన్నాయి. 7,500 మంది కోలుకోగా,  130కి పైగా మరణాలు సంభవించాయి. సోమవారం నాటికి దేశంలోని కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,424కి చేరగా, మృతుల సంఖ్య 9,520కి పెరిగింది.


ఇక రెండో రోజు ప్రధాని మోదీ సమావేశం కానున్న రాష్ట్రాల్లో దాదాపు 2.10 లక్షల కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశం మొత్తం కేసుల్లోని దాదాపు 65 శాతం వీటిలోనే నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగి రావడం వల్లే కోవిడ్‌ కేసులు పెరిగినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. దేశంలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇది ఆరోసారి. మార్చి 20న తొలిసారిగా సీఎంలతో ఆయన మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు తమ గళాన్ని గట్టిగానే వినిపించే అవకాశముంది. లాక్‌డౌన్‌ కారణంగా కుదేలయిన తమకు కేంద్రం ప్రత్యక్ష సాయం అందించాలని, షరతులు లేని రుణాలు అందించాలని ప్రధాని మోదీని కోరనున్నాయి. (ప్రమాద ఘంటికలు: భారత్‌పై కరోనా పడగ)

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎంలతో మాట్లాడిన తర్వాత ప్రధాని ఏం నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. (మళ్లీ తెర ముందుకు అమిత్‌ షా!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement