విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మమతా బెనర్జీ, షేక్ హసీనా, మోదీ
శాంతినికేతన్: గత కొద్ది సంవత్సరాలుగా భారత్–బంగ్లాదేశ్ దేశాల సంబంధాల్లో సువర్ణాధ్యాయం నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పరస్పర అవగాహన, సహకారమే ఇరు దేశాలను కలిపాయని పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమబెంగాల్ శాంతిని కేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో∙పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పశ్చిమబెంగాల్ గవర్నర్ త్రిపాఠి, సీఎం మమతా బెనర్జీతో వేదిక పంచుకున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో హసీనాతో కలసి బంగ్లాదేశ్ భవన్‌ను ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు చిహ్నంగా ఈ భవన్‌ను బంగ్లాదేశ్ నిర్మించింది.
స్నాతకోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సొంతగడ్డపై అడుగుపెట్టినందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉందని అన్నారు. యువ మెదళ్లను తీర్చిదిద్దుతున్న విశ్వభారతి వర్సిటీ ప్రయత్నాలను కొనియాడారు. ‘ మీరు 50 గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని విన్నా. విశ్వభారతి స్థాపించి 100 ఏళ్లు పూర్తయ్యే 2021 నాటికి మరో 50 గ్రామాల్లో విద్యుత్, గ్యాస్ కనెక్షన్, ఆన్‌లైన్ లావాదేవీలు కల్పించి అభివృద్ధి చేస్తామని ప్రతినబూనండి’ అని సూచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన అన్న సత్యేంద్రనాథ్ ఠాగూర్‌లకు గుజరాత్‌తో ఉన్న సంబంధాల్ని మోదీ గుర్తు చేసుకున్నారు. స్నాతకోత్సవ వేదిక వద్ద తాగునీటికి కొరత ఏర్పడినందుకు మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పారు.
అనుసంధానత జోరు..
గత కొన్నేళ్లుగా భారత్, బంగ్లాదేశ్ సంబంధాల్లో సువర్ణాధ్యాయం కొనసాగుతున్నందున భూ, తీర ప్రాంత సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యాయని మోదీ అన్నారు. రోడ్డు, రైలు, జల రవాణాతో రెండు దేశాల మధ్య అనుసంధానత వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్న 600 మెగావాట్ల విద్యుత్‌ను ఈ ఏడాదే 1100 మెగావాట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం మోదీ, హసీనా భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment