దళితులపై దాడుల్ని తిప్పికొట్టాలి
అవి దేశ సంస్కృతికి వ్యతిరేకం
►వేర్పాటు వాద శక్తులతో వ్యవస్థలు పక్కదారి
►పనిలో మర్యాద పాటించాలి.. భవిష్యత్తు కోసం ఐక్యంగా పనిచేయాలి
►స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: దేశంలో దళితులు, మైనార్టీలపై సాగుతున్న దాడులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. బలహీన వర్గాలపై దాడుల్ని మతిభ్రమణ చర్యలుగా అభివర్ణించిన ఆయన అవి దేశ సంస్కృతికి వ్యతిరేకమని అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. వేర్పాటువాద రాజకీయాలు చేసే గ్రూపుల్ని తీవ్రంగా తప్పుపట్టిన ప్రణబ్ వారు రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందని, ఈ వృద్ధి కొనసాగాలంటే కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరముందని గుర్తుచేశారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
‘ఈ నాలుగేళ్లలో కొంత ఆందోళనతో నేను గమనించాను. కొన్ని వేర్పాటువాద శక్తులు అసహనం, అశాంతి సృష్టించేందుకు యత్నించాయి. బలహీన వర్గాలపై దాడుల్ని మన సంస్కృతికి వ్యతిరేకమని గుర్తించాలి. అలాంటి శక్తులు ప్రాధాన్యం పొందకుండా ఉండేలా మన సమాజంలోని సమష్టి అవగాహన, రాజ్యాంగ వ్యవస్థలు నాకు నమ్మకం కలిగిస్తున్నాయి. దేశ గణనీయ వృద్ధి రేటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వాల్ని ఎన్నుకునే ప్రక్రియ కంటే ఉన్నతమైనది. స్వేచ్ఛ అనే గొప్ప చెట్టు ప్రజాస్వామ్య విభాగాల నుంచి తరచూ పోషణను కోరుతుంది. ఆటంకాలు, ఇబ్బందులు కల్గించడంతో పాటు కొన్ని వర్గాలు, వ్యక్తులు అనాలోచిత వేర్పాటువాద ఎజెండాతో వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటోంది.
మహిళలు, చిన్నారుల రక్షణతోనే...
మహిళలు, చిన్నారులకు మనం కల్పించే రక్షణ, భద్రతపైనే దేశ, సమాజ సంక్షేమం ఆధారపడి ఉంటుంది. మహిళలు, చిన్నారులపై జరిగే ప్రతి హింసాత్మక సంఘటనలు అభివృద్ధికి గాయం చేస్తాయి. ఈ విధుల నిర్వహణలో మనం విఫలమైతే మనల్ని మనం నాగరికులుగా పిలుచుకోలేం. మన రాజ్యాంగం కేవలం రాజకీయ లేదా న్యాయపరమైన పత్రం కాదు. ప్రభావవంతమైన ప్రజాస్వామ్యంలో చట్టం, చట్టాల్ని అమలు చేసే సంస్థల పట్ల విధేయత కలిగి ఉండాలి. ఏ వ్యక్తీ, ఏ గ్రూపు తన సొంత చట్టాలు ఏర్పరచుకోకూడదు.
రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టాలి: దేశంలోని ప్రతి విభాగం చేయాల్సిన విధులు, బాధ్యతల్ని రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించిం ది. అధికారులు, సంస్థలకు సంబంధించి భారతీయ ప్రాచీన సంస్కృతిలో భాగమైన మర్యాదను రాజ్యాంగం ఏర్పాటుచేసింది. విధి నిర్వహణలో భాగంగా యంత్రాంగాలు ఈ మర్యాదను పాటించి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలి. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుతున్న ఏకైక లక్షణం ఏమిటంటే ఒకరి సంస్కృతి, విలువలు, నమ్మకాలకు మరొకరు ఇచ్చే గౌరవం. ఆధునిక విజ్ఞానంతో మత సామరస్యాన్ని నెలకొల్పినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.
శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలి
దృఢమైన రాజకీయ ప్రోత్సాహంతో 60 కోట్ల మంది యువతకు ఆర్థికంగా చేయూత నిచ్చే భవిష్యత్తును నిర్మించాలి. అలాగే డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, నైపుణ్య భారతాన్ని సాధించాలి. వందల స్మార్ట్ సిటీలు, పట్టణాలు, గ్రామాలుగా భారత్‌ను నిర్మించుకోవాలి. మన నమ్మకాల్ని ప్రశ్నించుకుంటూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడంతో పాటు బలోపేతం చేయాలి. అసమర్థత, పనిలో నిర్లక్ష్యాన్ని ఒప్పుకునేందుకు నిరాకరించడాన్ని సవాలు చేయడం నేర్చుకోవాలి. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో మనుషుల స్థానంలో యంత్రాల్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞానం, నైపుణ్యం సాధించడంతోనే మనం నెట్టుకురాగలం. అలాగే వినూత్న అంశాల్ని నేర్చుకోవాలి. ఒక దేశంగా సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, సాంకేతికతను ప్రోత్సహించాలి. ఇందులో స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థలు బాధ్యత తీసుకోవాలి.
గతం కంటే భవిష్యత్తు ముఖ్యం
మనం తరచుగా గతంలో సాధించిన విజయా ల్ని గుర్తుచేసుకుని సంబరపడతాం. భవిష్యత్తు గురించి ఆలోచించడం అంతకంటే ముఖ్యం. సహకరించుకునేందుకు, వినూత్నంగా సాగేందుకు, ముందడుగు కోసం చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల కాలంలో భారత్ గణనీయ వృద్ధి సాధించింది. గత దశాబ్దకాలంలో తరచుగా 8 శాతం కంటే వృద్ధి సాధిస్తున్నాం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను అంతర్జాతీయ విభాగాలు పేర్కొన్నాయి. భారత్‌లో వ్యాపారం సులభమైందంటూ అనేక సూచీలు చెబ్తున్నాయి. స్టార్టప్ ఉద్యమం, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న స్ఫూర్తి ప్రపంచం దృషిన్టి ఆకర్షించింది. మన సామర్థ్యాలపైనే అభివృద్ధి భారతాన్ని నిర్మించాలి. అప్పుడే అభివృద్ధి మనగలుగుతుంది, ముందుకెళ్తుంది. ఇటీవల విదేశాంగ విధానంలో ఆశించిన మేర ప్రగతి సాధించాం.
ఉగ్రవాదంపై ఏకకంఠంతో..
మతం పేరిట అమాయక ప్రజల్ని చంపడమే కాకుండా, ప్రపంచ శాంతిని నాశనం చేసేలా ఉగ్రవాదం తయారైంది. ఈ ఉగ్రవాద శక్తులు ప్రపంచ దేశాలన్నింటికి ప్రమాదంగా పరిణమించాయి. ఎలాంటి షరతులు లేకుండా ఏక కంఠంతో వాటిపై ప్రపంచ దేశాలన్నీ పోరాడాలి.