ఓడిపోయినా తిరిగి మంత్రిని అవుతా!
ముంబై: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పై బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. తాను పనాజీ ఎన్నికలో ఓడిపోయినా ఫర్వాలేదని, కేంద్ర రక్షణ మంత్రి పదవి తన కోసం తిరిగి ఎదురు చూస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో ఈ మధ్య వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా, శివసేన తన పత్రిక సామ్న సంపాదకీయంలో పారికర్‌ను ఏకీపడేసింది.
"పారికర్ రాజకీయ ధురంధరుడు, నిజాయితీ పరుడు అన్న మాట ఈ ప్రకటనతో అబద్ధమని తేలింది. ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన చేయాల్సిన వ్యాఖ్యలు కావు. దేశ అత్యున్నత పదవిని కూడా హేళన చేస్తూ ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో రక్షణ మంత్రి బాధ్యతలు అప్పజెప్పిన ప్రధాని మోదీని కూడా ఆయన అవమానించారు" అని సామ్న వ్యాసంలో పేర్కొంది. ఇలాంటివి ప్రజల్లో నేతలపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయని తెలిపింది. అంతేకాదు సరిహద్దులో ఓ పక్క ఉద్రిక్తత పరిస్థితి ఉన్న సమయంలో, పారికర్ సెలవుపై గోవాకు వెళ్లి చేపల కూర వండుకుని తిన్న ఉదంతంను కూడా సామ్న ప్రస్తావించింది.
అయితే బీజేపీ మాత్రం పారికర్ వ్యాఖ్యలతో కూడిన టేప్‌ను ఓ అబద్ధంగా తేల్చేసింది. ఈ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన పార్టీ అబద్ధపు ప్రచారంతో ఎన్నికల కోడ్ ను ఉల్లఘిస్తున్నారంటూ పేర్కొంది. రక్షణ మంత్రిగా రాజీనామా చేసిన పారికర్, గోవాలో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరిగి ప్రత్యక్ష ఎన్నిక సమరానికి సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న పనాజీ, వల్పోయి నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి.
నేనేం ఢిల్లీ వెళ్లట్లేదు... ఫడ్నవిస్
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు కోసం బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తుందన్న వార్తలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదని ఆయన తేల్చేశారు. కేంద్ర మంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, అధిష్ఠానం నుంచి అలాంటి సంకేతాలు కూడా అందలేదని ఆయన తెలిపారు. 2019 వరకు తాను ముఖ్యమంత్రిగా, రావ్ సాహెబ్ దన్వే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతారని ఫడ్నవిస్ స్పష్టం చేశారు.