మోదీ చెబితే ఒప్పుకున్నా
► ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై వెంకయ్య నాయుడు
► విస్తృత ప్రయోజనాల కోసం అంగీకరించా
► విలేకర్లతో ఇష్టాగోష్టి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా తన పేరు ప్రకటించాక మీడియాలో విస్తృతంగా వచ్చిన ఊహాగానాలకు ఎం. వెంకయ్య నాయుడు తెరదించారు. తనను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించడానికి ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలను గట్టిగా తోసిపుచ్చారు. ‘అలా అనడం తప్పు.. మూర్ఖత్వం.. ప్రధాని మోదీ సూచన మేరకు, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించాను’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన ఆదివారమిక్కడ తెలుగు మీడియా ప్రతినిధులతో తన మనసులో మాటలను విప్పిచెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై వెంకయ్య ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
ఏదేదో రాశారు..
నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటినుంచి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో విపరీతంగా రాశారు. నాకు ఉప రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదని, పక్కకు తప్పించడానికే రాజ్యాంగ పదవివైపు నెట్టారని.. ఏదేదో రాశారు. నేను యుక్తవయసు నుంచే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. రాజకీయ జీవితాన్ని ఆస్వాదిస్తూ పూర్తిగా రాజకీయ జీవినైపోయాను. స్వభావరీత్యా ప్రజల మధ్య ఉండడం నాకిష్టం. స్నేహితులతో, రాజకీయ కార్యకర్తలతో కలసి సినిమాలకు, హోటళ్లకు వెళ్లడం ఇష్టం. ప్రొటోకాల్ తరహా పదవులకు స్వభావసిద్ధంగానే వ్యతిరేకం.
అమిత్ షా నచ్చజెప్పారు..
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. కొంద రి పేర్లు సూచించమని నన్నూ అడిగితే కొన్ని పేర్లు చెప్పాను.. అయితే చాలా మంది సీని యర్లు మీ పేరు సూచిస్తున్నారని, అందుకు అంగీకరించాలని అమిత్ షా నాతో చెప్పారు.. రాజకీయ కార్యకర్తను కావడం వల్ల రాజ్యాంగ పదవులకు తగనేమోనని తొలుత సంశయిం చాను. అయితే అమిత్ షా నచ్చజెప్పారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేని పరిస్థితుల్లో విస్తృత ప్రయోజనాల కోసం అంగీకరించాలని కోరారు. రాజకీయ అనుభవమున్న మీరే సరైన అభ్యర్థిగా పార్టీ భావిస్తోందని, దీనిపై మోదీతో మాట్లాడమన్నారు.. తర్వాత మోదీతో చర్చించాను. ఆయన సూచనపై విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించాను.
సామాజిక సేవ చేయాలనుకున్నాను..
నేను మోదీ కేబినెట్‌లో చేరినప్పటినుంచి ఒక కోరిక ఉండేది.. మోదీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ గెలవాలని.. ఆ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుని జనసంఘ్ నేత నానాజీ దేశ్‌ముఖ్ బాటలో సామాజిక సేవ చేయాలనుకున్నాను.
ఇబ్బందికరమే
రాజకీయాల్లో 40 ఏళ్లు క్రియాశీలకంగా ఉన్న తర్వాత రాజ్యాంగ పదవివైపు వెళ్లడానికి ఎవరైనా ఇబ్బంది పడడం సహజమే. ఎమర్జెన్సీ సమయంలో అసలైన రాజకీయాలు తెలుసుకున్నా. యుక్త వయసులోనే పార్టీ నాకు అన్నీ ఇచ్చింది. నేను అత్యంత అదృష్టవంతుణ్ని.
1971లో జరిగింది మరచిపోవద్దు
1971లో భారత్‌తో యుద్ధంలో ఏం జరిగిందో మరచిపోవద్దని వెంకయ్యనాయుడు పాక్‌ను హెచ్చరించారు. ఆదివారమిక్కడ కార్గిల్ యుద్ధ అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ నిర్వహించిన కార్గిల్ పరాక్రమ్ పరేడ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దక్షిణాది వ్యక్తికి ఇవ్వాలి!: మోదీ
ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించాలని మోదీ.. వెంకయ్యను కొన్ని కారణాలతో ఒప్పించినట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రపతి ఉత్తరాదికి చెందిన క్రియాశీల రాజకీయాల్లోలేని దళితుడు కావడం వల్ల ఉప రాష్ట్రపతి పదవి దక్షిణాదికి చెందిన వ్యవసాయ నేపథ్యమున్న వ్యక్తికి దక్కాలి అని మోదీ.. వెంకయ్యతో జరిపిన భేటీలో చెప్పారు. వెంకయ్య సుదీర్ఘ రాజ కీయ అనుభవం బీజేపీకి మెజారిటీ లేని రాజ్యసభలో సభా వ్యవహారాలను సజావుగా సాగిం చడానికి దోహదపడుతుందన్నారు. మీ పేరును చాలామంది సీనియర్ నేతలు సూచించారని ఆయన వెంకయ్యతో అన్నారు’ అని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.