మీసం తీసేస్తా!
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తప్పు చేయలేదని నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేస్తా అని డీఎండీకే అధినేత విజయకాంత్ గురువారం సవాల్ చేశారు. న్యాయమూర్తి తీర్పును తప్పుబట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ తన నియోజకవర్గం రిషి వందియంలో గురువారం పర్యటించారు. ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన కార్యక్రమాలు, పనులను పరిశీలించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పోలీసు శాఖకు, అన్నాడీఎంకే వర్గాలకు సవాళ్ల మీద సవాళ్లను విసిరారు. తాను బతకడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కష్ట పడి పనిచేసి, ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. బతికేందుకు తనకు అనేక మార్గాలు ఉన్నాయని వివరించారు.
అయితే, ఇక్కడ పాలకులు ప్రతిపక్షాల గళం నొక్కేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలను నీచాతి నీచంగా చూసినందుకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ఓ మారు గుర్తు చేసుకోండంటూ పరోక్షంగా అన్నాడీఎంకే వర్గాలకు చురకలంటించారు. ధర్మం గెలిచిందని, అందుకే బెయిల్ రావడం లేదని వ్యాఖ్యలు చేస్తూ, ఇక జయలలితకు బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి చేయకుండా, దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే వారికి జైలు శిక్ష తప్పదని, ఇందుకు జయలలిత కేసు ఓ హెచ్చరికగా పేర్కొన్నారు. తమ అమ్మ జైల్లో ఉందని మంత్రులందరూ తెగ ఏడ్చేస్తున్నారని, అలాంటప్పుడు అమ్మ బయటకు వచ్చాకే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చుగా అని ప్రశ్నించారు. మొసలి కన్నీళ్లు కారుస్తూనే పదవుల్ని కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇదే నా సవాల్: పాలకుల తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత, విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నాయన్నారు. అయితే,ప్రతి పక్షాల గొంతు నొక్కే విధంగా కేసుల మోతలు మోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి పక్షాలు ద్విముఖాలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఎవరి ముఖాలు ఎలా ఉన్నాయో సరి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం లక్ష్యంగా వ్యవహరిస్తే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవర్నీ దోచుకోలేదని, ప్రజల ఆస్తులు కబ్జా చేయలేదని పేర్కొంటూ, ఇవన్నీ చేసిన వాళ్లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
ఇది వరకు ఉన్న పాలకులు టీవీలను ఇచ్చారని, ఇప్పుడున్న వాళ్లు కంప్యూటర్లు ఇచ్చారని గుర్తు చేస్తూ, వాటిలో మైకెల్ డీ గున్హ ఇచ్చిన తీర్పును ప్రజలు చూసుకుంటున్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. పోలీసు యంత్రాంగం మనస్సాక్షితో పనిచేయాలని, వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పాత కాలపు చట్టాలు చేతిలో పెట్టుకుని ప్రతి పక్షాల్ని బెదిరించడం మానుకుని నిబద్ధత, నిజాయితీతో పనిచేయాలని కోరారు. జయలలిత ఏ తప్పూ చేయలేదని, ఆమె నిర్దోషి అంటూ మైకెల్ డీ గున్హ తీర్పును వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక వేళ ఆమె తప్పు చేయకుంటే, బెయిల్ వచ్చి ఉండేదిగా అని ప్రశ్నించారు. ఆమె తప్పూ చేయలేదని పోలీసు యంత్రాంగం కానీ, అన్నాడీఎంకే నాయకులు కానీ నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేసి తిరుగుతాననని సవాల్ చేశారు.