జీవితమే సందేశమైన ‘బాపూజీ’
ప్రజల మనిషి. స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పద వులకోసం ఎన్నడూ రాజీపడ లేదు. అర్రులు చాచలేదు. నిర్మొహమాటంగా ఉంటూనే, అందరినీ కలుపుకుపోయే శైలి వారిది. 1915, సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ వాంకిడిలో పుట్టి; 2012 సెప్టెంబర్ 21న హైదరాబాద్ అశోక్‌నగర్‌లో తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. వెంట ఎవరూ లేనప్పుడు కూడా ఒంట రిబాటసారిగా సమాజానికి వేగుచుక్కగా ముందుకు నడిచిన జీవితం బాపూజీది. బాపూజీ చరిత్రలో అనేక విజయాలు ఉన్నాయి. వెనక్కి నెట్టివేసిన క్రమాలున్నాయి. కానీ, ఆయన ఎన్నడూ దొడ్డిదారిలో ఎదగడానికి ఇచ్చగించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నుంచి యువతరం నాయకులుగా ఎదగా లని ఆయన ఎంతో ఆశించారు. అయితే వ్యక్తి స్వార్థం ప్రబలి పోయి గ్రూపు రాజకీయాలు, కులవివక్ష పెరిగిపోవ డంతో బడుగు, బలహీన వర్గాల నాయకత్వం ఎదగలేక పోవడం బాపూజీలో తీరని క్షోభను మిగిల్చింది.
బహుజనులు అన్ని రంగాల్లో సాధికారత సాధిం చాలని బాపూజీ కలలుగన్నారు. ఆధునిక విద్య అందు కోవడానికి హాస్టళ్లు అవసరమని పద్మశాలీ హాస్టల్ కోసం దశాబ్దాలు చేయూతనిచ్చిన బాపూజీ ఎన్నో కుల సంఘా లకు, సహకార సంఘాలకు మార్గదర్శకులు, స్ఫూర్తిదాత అయ్యారు. దళిత సంఘాలకు నిరంతరం మద్దతునిస్తూ ముందుకు సాగారు. బీసీల రిజర్వేషన్లు, ఆయా కులాల వృత్తి, సహకార సంఘాలకు సబ్సిడీలు, రాయితీలు- చేనేత అభివృద్ధి, దళితుల హక్కులు వంటి అంశాలలో సాంఘిక సంక్షేమం కోసం ఆయన చేపట్టని కార్యక్రమం లేదు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘా నికి అధ్యక్షులుగా నియమించినప్పుడు నిక్కచ్చిగా ఎవరూ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారో వారి కేసులను ప్రతిదీ ప్రత్యక్షంగా పరిష్కరించారు. కొడుకుని భారత్-పాకిస్తాన్ యుద్ధానికి పంపించారు. భార్య యుద్ధంలో డాక్టర్‌గా సేవలు అందించారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మహోన్నతమైనది. వయోభారాన్ని తోసిరాజని తెలంగాణ రాష్ట్ర సాధనకు తనవంతు కృషి చేశారు. పదవుల కోసం ఏనాడూ వెంపర్లాడలేదు. జీవించి ఉన్నప్పుడే బాపూజీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం గొప్ప చారిత్రక సంఘటన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుని జయంతి, వర్ధంతు లను ఏటా అధికారికంగా నిర్వహించాలని సంకల్పిం చడం శుభపరిణామం.
(నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతి)
వ్యాసకర్త పూర్వ సభ్యులు, రాష్ట్ర బీసీ కమిషన్
మొబైల్ : 98499 12948
- వకుళాభరణం కృష్ణమోహన్‌రావు