చుక్ చుక్ మోడీ రైలు వస్తుంది... | get ready to railway budget | Sakshi
Sakshi News home page

చుక్ చుక్ మోడీ రైలు వస్తుంది...

Published Tue, Jul 8 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

చుక్ చుక్ మోడీ  రైలు వస్తుంది...

చుక్ చుక్ మోడీ రైలు వస్తుంది...

రైల్వేల భద్రత ప్రమాదకరంగా ఉందని, ఇప్పుడున్న ట్రాక్ పరిస్థితిని బట్టి ఒక్క కొత ్త రైలును కూడా ప్రవేశపెట్టకూడదని, ఈ స్థితి నుండి రైల్వేలు బయటపడి కోట్లాది ప్రయాణీకులను భద్రంగా గమ్యాలకు చేర్చాలంటే కనీసం లక్ష కోట్లు అవసరమని అనిల్ కకోద్కర్ కమిటీ నివేదించింది.
 
స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో 53 వేల కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. ఈ 67 సంవత్సరాలలో పాలకులు 11,215 కిలోమీటర్ల రైలు మార్గం మాత్రం నిర్మించి, 120 కోట్ల ప్రజల ప్రయాణావసరాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఏటా ఓ బడ్జెట్, కొన్ని రాయితీలు, కొన్ని కొత్త రైళ్లు, కొన్ని మార్గాల ప్రకటన,  రవాణా చార్జీల పెంపు - ఓ పరిపాటిగా మారింది. కానీ ప్రకటించిన రైళ్లు పట్టాలెక్కవు. రాను రాను రైలు ప్రయాణానికి భరోసా లోపిస్తున్నది. కొత్త ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ దేశ ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. గత ప్రభుత్వాల నిర్వాకాల వల్లే రైల్వేలు అభివృద్ధికి నోచుకోలేదని, భారతీయ రైల్వేల రూపురేఖలు మారుస్తానని కొత్త ప్రధాని చెబుతున్నారు.
 రైల్వేల ఆర్థిక స్థితి:

సరుకు రవాణాపై 2011-12లో రూ. 69,547 కోట్లు, 2012-13లో రూ. 85,956 కోట్లు, 2013-14లో రూ. 93,554 కోట్లు రాగా, ప్రయాణీకుల ద్వారా 2011-12లో రూ. 28,264కోట్లు, 2012-13లో 32,500 కోట్లు రాగా 2013-14లో 42,210 కోట్ల ఆదాయం  వస్తుంది. అంటే సరుకు రవాణాతో 65శాతం, ప్రయాణికుల ద్వారా 27 శాతం, ఇతరత్రా 8 శాతం ఆదాయం లభిస్తున్నది. రైల్వే ఉద్యోగుల (15.4లక్షలు) జీత భత్యాలకు 37శాతం, ఇంధనం కోసం 18 శాతం, పింఛను నిధికి 16 శాతం, ఇతర వ్యయాలకు 29 శాతం ఖర్చవుతున్నది. 2007-08 సంవత్సరంలో రైల్వే శాఖ ఖర్చు ఆదాయంలో 75.9 శాతం కాగా, ప్రస్తుతం అది 100 శాతానికి చేరింది. ఈ స్థితిలో రైల్వేల వద్ద విస్తరణ, ఆధునీకరణ పనులకు మిగులు ధనం ఉండటం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ నుండి ఆశించిన వార్షిక మద్దతు లభించటం లేదు. దశాబ్ద కాలం(2003-2013)లో ప్రయాణ చార్జీలు ఏమాత్రం పెంచకపోవటం వలన, వాస్తవ అవసరాలకయ్యే వ్యయం కన్నా, హంగు, ఆర్భాటాలకు అర్థంలేని ఖర్చులు పెంచుకుంటూ పోవటం వలన, పనులకు ఎక్కువ విలువ నిర్ధారించటం, సకాలంలోనిర్మాణాలు పూర్తికాక, పనుల వ్యయం 2-3 రెట్లు పెరిగిపోవటంతోనూ వృథా వ్యయం పెరిగింది. ఎన్నికలు, ఓట్ల కోణంలోనే రైల్వేలో చార్జీల పెంచడం, రాయితీలు ఇవ్వడం, అవినీతి వంటి కారణాలతో ఖర్చు పెరుగుతోంది. బడ్జెట్ రోజు, చార్జీలు పెంచినప్పుడు  ప్రతిపక్షంలో ఉన్నవారు అరవటం ఒక తంతుగా మారింది.

రైల్వేల భద్రత

రైల్వేల భద్రత ప్రమాదకరంగా ఉందని, ఇప్పుడున్న ట్రాక్ పరిస్థితిని బట్టి ఒక్క కొత్త రైలును కూడా ప్రవేశపెట్టకూడదని, ఈ స్థితి నుండి రైల్వేలు బయటపడి కోట్లాది ప్రయాణికులను భద్రంగా గమ్యాలకు చేర్చాలంటే కనీసం లక్ష కోట్లు అవసరమని అనిల్ కకోద్కర్ కమిటీ నివేదించింది. రైల్వేలను ఆధునీకరించాలంటే రూ. 8 లక్షల 22 వేల కోట్లు అవసరమని శ్యాం పిట్రోడా కమిటీ చెప్పింది. రైల్వేల భద్రతకు అవసరమైన నిధులను రైల్వేలకు కేంద్రం అందించటం ద్వారా, ఆధునీకరణకు అవసరమైన నిధుల కోసం రైల్వేలు స్వంత వనరులను వృద్ధి చేసుకోవడం ద్వారా, నూతన రైలు మార్గాలను రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు 50ః50 శాతం నిధులను భరించటం ద్వారా మాత్రమే కోరుకున్న రాష్ట్రాలకు కోరినన్ని నూతన మార్గాలు  అందుబాటులోకి రాగలవు.

మన ఎంపీల పలుకే బంగారం

1996 నుంచి 2003 వరకు రైల్వే దాదాపు ప్రతి ఏటా చార్జీలను పెంచింది. 2004 నుండి 2012 వరకు పెంచ లేదు. కానీ సరుకు రవాణా చార్జీలు పెంచారు. కొన్ని బడ్జెట్‌లలో ఎసీ, స్లీపర్ క్లాస్ చార్జీలను తగ్గించారు. అయినా  2003-2012 మధ్య ప్రయాణికుల ద్వారా ఆదాయం పెరిగింది. రైళ్ల సంఖ్య క్రితం కన్నా బాగా పెరిగింది. కానీ భద్రత, విస్తరణ విషయాలలో చార్జీలు పెంచిన కాలంలోనూ, పెంచని కాలంలోనూ కూడా ఒక్కలాగే ఉంది.  ఇక మన తెలుగు పార్లమెంటు సభ్యులు ఏనాడైనా వారి ప్రాంత సమస్యను ప్రస్తావించి, పరిష్కరించారా? ఇకనైనా తమ ఊళ్లకి మాత్రం రైళ్లు, రైళ్లు అని అరవటం మాని, రైలు ముఖం తెలియని సాటి తెలుగు వారు నివసించే ప్రాంతాలకు మార్గాలను నిర్మించేందుకు కృషి చేయాలి.

ఆంధ్రప్రదేశ్ అవసరాలు

 అన్ని రైళ్లు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తాయి. కానీ ఇక్కడి ప్రజల అవసరాలను తీర్చడంలో అవి పూర్తిగా విఫలమవుతున్నాయి. ఈ ప్రాంతంలో విజయవాడ పెద్ద కూడలి. కానీ ఇక్కడ నుంచి ఏ ప్రధాన నగరానికీ బయలుదేరదు. కోటిపల్లి-నర్సాపురం మార్గానికి (58 కిమీ) 2001లో అనుమతులు వచ్చినా, ఇప్పటికీ నిర్మాణం పూర్తికాలేదు. కాకినాడ-పిఠాపురం లైను కూడా అంతే. 1999లో అనుమతులు వచ్చినా పనులు పూర్తికావడం లేదు. దుగరాజపురం-కృష్ణపట్నం మార్గానికి అనుమతి వచ్చి దశాబ్దం గడిచినా, కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగి నాలుగేళ్లు అయినా రైలు మార్గం మాత్రం పూర్తికాలేదు. నిడదవోలు-భీమవరం-గుడివాడ మార్గం డబ్లింగ్‌కు, గుడివాడ-నర్సాపురం మార్గం డబ్లింగ్‌కు 2012లో అనుమతులు వచ్చాయి. నేటి కి పనులు పూర్తి చేయలేదు. మచిలీపట్నం-గుడివాడ-విజయవాడ మార్గం పరిస్థితి కూడా ఇంతే.

అన్నింటా వెనుకబడిన రాయలసీమలో రైలు సౌకర్యం కూడా కరువే. కడప-బెంగళూరు కొత్తమార్గానికి 2008లో ఆమోద ముద్ర పడినా నిధులు లేక పనులు సాగడం లేదు. నంద్యాల-ఎర్రగుంట్ల మార్గం పనులు 1999లో మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి చేయలేదు. భద్రాచలం-కొవ్వూరు, నడికుడి-శ్రీకాళహస్తి మార్గాలకు 2010లో అనుమతులువచ్చినా ఇంతవరకు పనులు మొదలు కాలేదు. ఈ మార్గాలను కేంద్రం, రాష్ట్రం చెరి సగం భరించి నిర్మించేందుకు అంగీకరించాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు సాగడం లేదు. నడికుడి - శ్రీకాళహస్తి మార్గం సిద్ధమైతే రైలు సౌకర్యం గురించి తెలియని నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మొత్తం 38 స్టేషన్లు ఏర్పాటు కాగలవు. వరద బెడద ఉన్న విజయవాడ-చెన్నయ్ మార్గానికి ప్రత్యామ్నాయం కూడా లభిస్తుంది. దీనిని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మరో వెనుకబడిన ప్రాంతం ఒంగోలు-దొనకొండ మార్గం నిర్మాణానికి ఎన్నిసార్లు సర్వేలు పూర్తయినా ఆమోదానికి నోచుకోవడం లేదు. గ్రానైట్ ఉత్పత్తికి పేర్గాంచిన చీమకుర్తికి రైలు మార్గం లేకపోవడం విచారకరం. హోస్‌పేట-గుంతకల్ మధ్య డబ్లింగ్ పనులు 1996 నుంచి నడుస్తున్నాయి. గుంతకల్ - గుత్తికల్లూరు  మధ్య, కాట్పాడి - పాకాల - తిరుపతి మధ్య రెండు దశాబ్దాల నుంచి డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి.
 ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త రాష్ట్రం. ఎలాంటి వసతులు లేవు. రాయలసీమలో కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తే కొంత మేలు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఏదో ఒక నగరం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలి. ముందు విశాఖపట్నంను భువనేశ్వర్ జోన్ నుండి వేరు చేయాలి. విశాఖపట్నం, విజయవాడ, అనంతపురంల నుండి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశ పెట్టాలి.  
 రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తామని, ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేలను అభివృద్ధి చేస్తామని విమానాశ్రయాల్లా రైల్వేస్టేషన్లను మారుస్తామని  ప్రధాని చెబుతున్నారు. నిజానికి అవి సాధ్యమా? ఒక వేళ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తే ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ టికెట్ 150 రూపాయలు. అదే జరిగితే స్టేషన్లలో ప్రయాణికులే ఉండరు.ఎఫ్.డి.ఐ.లు ప్రైవేటు భాగస్వామ్యలతో సగటు భారతీయునికి మేలు జరగకపోగా కీడే జరుగుతుంది.

 దేశంలో 60 శాతం జనాభాకు రైలు ముఖం తెలియదు. ఆప్రాంత ప్రజలకు ముందు రైలు మార్గాలు నిర్మించాలి. హైస్పీడ్ రైళ్లమాట ఈ ఏడాదికి పక్కన బెట్టి ఉన్న రైళ్లు ఎలాంటి ప్రమాదాలు లేకుండా గమ్యం చేరడానికి అవసరమైన చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి.    

 (వ్యాసకర్తలు సోషల్ అవేర్‌నెస్ కాంపెయిన్ సభ్యులు).  వి. దిలీప్‌కుమార్     యం. రోజాలక్ష్మి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement