చెరగని కమ్యూనిస్టు స్ఫూర్తి డా॥చెలికాని
1952 తొలి సాధారణ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కమ్యూనిస్టు అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ చెలికాని రామా రావును తలచుకోవటమంటే ఆనాటి వైభవోపేతమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ఆదర్శప్రాయులైన నాయకులను స్మరించుకోవటమే. నమ్మిన ఆశయాలను మనసా, వాచా, కర్మణా ఆచరించి తర్వాత తరాల వారికి డా॥రామారావు ఎంతో స్ఫూర్తి కలిగించారు.
కాంగ్రెస్ పార్టీలో ఆయనతో కలసి పనిచేసిన మొసలికంటి తిరుమలరావు, మహర్షి బులుసు సాంబమూర్తిలను ఓడించి కాకినాడ నుంచి పార్లమెంట్‌కు గెలవటం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. 1901, జూలై 15న చెలికాని రామారావు తూర్పుగోదావరి జిల్లా కొండెవరంలో జన్మించారు. సర్ రఘుపతి వెంకట రత్నం నాయుడు బ్రహ్మసమాజ సిద్ధాంతాలతో ప్రభావితమైన డా॥చెలికాని స్వాతంత్య్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ ప్రభావంతో కాంగ్రెస్ వైపు ఆకర్షి తులయ్యారు. 1921లో కాకినాడకళాశాలలో చదువుతున్నప్పుడు గాంధీజీ పిలు పుపై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్కూళ్లు, కోర్టులు బహిష్కరిస్తూ సాగిన సత్యా గ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు.
1930లో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతూ 15 రోజుల్లో పరీక్షలు ఉన్నా, వాటిని వదిలిపెట్టి తూర్పు గోదావరిజిల్లా వచ్చి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930-31లో శాసనో ల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చట్ట ధిక్కారణ నేరానికి ఒకటిన్నర ఏళ్లు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. అప్పుడు బెంగాలీ డిటెన్యూలతో కలిగిన పరిచయంతో కమ్యూనిస్టు మూలసూత్రాలు తెలుసుకుని ప్రభా వితులయ్యారు. 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాకినాడ వచ్చి నప్పుడు అప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్న పరకాల పట్టాభి రామారావుతో కలసి సభ విజయవంతానికి డా॥చెలికాని కృషి చేశారు. రామచంద్రపురంలో 1940లో వైద్యవృత్తిలో స్థిరపడి పేదల డాక్టరుగా పేరు తెచ్చుకున్నారు. 1956లో అప్పటి లోక్‌సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ నాయకత్వంలో చైనా పర్యటించిన ప్రతినిధి వర్గంలో డా॥చెలికాని ఉన్నారు. చైనా అధ్యక్షుడు మావోతో సహా కమ్యూనిస్టు పార్టీ ప్రముఖులందరినీ కలిశారు.
రామారావుగారి సతీమణి కమ లమ్మ ఆయనకు అన్నింటా చేదోడువాదోడుగా నిలిచి 1976లో కన్నుమూశారు. ఆమె వైద్యశాఖ అధికారిణిగా ఉండి ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్నారు. మరపురాని కమ్యూనిస్టుగా ప్రజల స్మృతుల్లో నేటికీ సజీవులుగా ఉన్న డా॥చెలికాని 1985, సెప్టెంబర్ 25న కన్నుమూశారు. డా॥రామారావు 30వ వర్ధం తి సభను రామచంద్రపురంలో వారి స్మారక కమిటీ నిర్వహించనుంది. ఆచా ర్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సైంటిఫిక్ సోషలిజం డెరైక్టర్ డా॥నన్నపనేని అంజయ్య స్మారకోపన్యాసం చేస్తారు.
- (నేడు డా॥చెలికాని రామారావు 30వ వర్ధంతి సందర్భంగా...)
కాగితాల రాజశేఖర్ కార్యదర్శి, భారత సాంస్కృతిక సహకార
స్నేహ సంఘం, ఆంధ్రప్రదేశ్, మొబైల్: 99483 17270