బెంగళూరు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకుతున్నారు. బీజాపూర్‌లో మంగళవారం ఓ ర్యాలీలో ఆమె ప్రసంగించనున్నారు. 21 నెలల విరామం తర్వాత సోనియా మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు 2016 ఆగస్టు 2న వెళ్తుండగా ఆమె మార్గమధ్యంలో అనారోగ్యానికి గురయ్యారు.
ఆ తర్వాత పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో శాసనసభ ఎన్నికలు జరగ్గా సోనియా ఏ రాష్ట్రంలోనూ ప్రచారం చేయలేదు. బీజాపూర్‌లో సోనియా ర్యాలీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామంతర్వాత ఆమె తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లోనే ప్రచారం చేయబోతున్నారనీ, ఈ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యమనేందుకు ఇదో ఉదాహరణ అని కర్ణాటక కాంగ్రెస్ తాత్కాలిక కార్యదర్శి మాణిక్యం టాగూర్ పేర్కొన్నారు.
1998లో తొలి ఎన్నికల ప్రసంగం
1998లో సోనియా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది జనవరి 11న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు (సోనియా భర్త రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురైన చోటు)లో తొలిసారి ఆమె ఎన్నికల ప్రసంగం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె రెండుసార్లు మాత్రమే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా విరామం తీసుకున్నారు.
ఇటీవలి 21 నెలల వరుస విరామానికి తోడు 2012లో మణిపూర్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా మిలిటెంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరిక మేరకు సోనియా ప్రచారం చేయలేదు. సోనియా బీజాపూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనే మంగళవారమే అదే జిల్లాలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఓ భారీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనుండటం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment