సమావేశానికి హాజరైన పార్టీ కార్యకర్తలు
రావులపాలెం (కొత్తపేట) : ఎన్నికల సమరానికి ఎంతో సమయం లేదని, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెం సీఆర్‌సీ ఆడిటోరియంలో సోమవారం జరిగిన నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో 252 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, ప్రతి 100 మందికి ఒక బూత్ సభ్యుడు ఉండేలా కన్వీనర్లు నియామకాలు చేపట్టాలని సూచించారు.
ఇందుకు ఉత్సాహవంతులు, పార్టీ కోసం పని చేసేవారిని తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను నాయకులకు వివరించి, పరిష్కరించడం ద్వారా పార్టీని ప్రజలకు దగ్గర చేసేందుకు వారథులుగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల సూక్ష్మస్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి చేర్పులు, తొలగింపులపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని, అతడితో పోరాడుతున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
రాజధానిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం
స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లు వద్దని సుప్రీంకోర్టు చెప్పినా, చంద్రబాబు అదే పద్ధతిలో రాజధాని నిర్మాణం చేస్తూ, 53 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. తమ అనుకూల ఎల్లో మీడియాలో పదేపదే రాజధాని ఊహాచిత్రాలను చూపిస్తూ ప్రజలను మ«భ్యపెడుతున్నారని, వాస్తవంగా అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేదని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలతో పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. టీడీపీని ప్రజలు ఓడించడానికి జన్మ«భూమి కమిటీలనే ఒక్క కారణం చాలని చెప్పారు.
రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేసినా, స్పీకర్ ఇంతవరకూ వారిపై అనర్హత వేటు వేయకపోవడం, వారిలో నలుగురితో మంత్రులుగా సాక్షాత్తూ గవర్నరే ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ధర్మాన దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కులమత రాజకీయాలకు అతీతంగా అందరికీ పథకాలను అందించారని, కానీ చంద్రబాబు తమకు ఓటు వేస్తేనే లబ్ధి చేకూరుస్తామనే నీచమైన పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
గడచిన 70 ఏళ్లలో ఇంత అన్యాయమైన పాలన ఏనాడూ చూడలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కమీషన్లపై కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందని ఆరోపించారు. ఈ మోసాలన్నింటినీ ప్రజలకు వివరిస్తూ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీ సభ్యులపై ఉందని ధర్మాన అన్నారు.
మరో ముఖ్య అతిథి, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం గతంలో లేని పోల్ మేనేజ్‌మెంట్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ అనే రెండు కొత్త స్కీములు అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు, రెండేసి ఓట్లు ఎలా వేయాలో పోల్ మేనేజ్‌మెంట్ ద్వారా శిక్షణ ఇస్తే.. చేసిన దూబరా ఖర్చులను కప్పిపుచ్చడానికి ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. రాజకీయాన్ని వ్యాపారం, నేరమయంగా మార్చేశారన్నారు.
మాజీ మంత్రి, అమలాపురం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పీఏసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణుగోపాలకృçష్ణ, పితాని బాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంయుక్త కార్యదర్శి గొల్ల పల్లి డేవిడ్‌రాజు, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యురాలు మద్దూరి సుబ్బలక్ష్మి, మునికుమారి తదితరులు పాల్గొన్నారు.
బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను, సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రొఫెసర్లు రవికుమార్, నారాయణరెడ్డిలు పోలింగ్ బూత్ కమిటీల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, పంచాయతీరాజ్ చట్టం, సమాచార హక్కు చట్టం, సామాజిక మాధ్యమాలు, వర్తమాన రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసం, పార్టీ ఆవిర్భావం, ఆదర్శవాదం తదితర అంశాలపై అవగాహన కలిగించారు. అనంతరం ధర్మాన, బోస్ తదితర నాయకులను జగ్గిరెడ్డి ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment