3 రాజధానులు: జీవీఎల్‌ కీలక వ్యాఖ్యలు | GVL Narasimha Rao Crucial Comments Over Three Capitals For Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణను సమర్థిస్తున్నాం: జీవీఎల్‌

Published Wed, Dec 18 2019 12:55 PM | Last Updated on Wed, Dec 18 2019 4:29 PM

GVL Narasimha Rao Crucial Comments Over Three Capitals For Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒకేచోట రాజధాని నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి జరగదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడారు. 

రాజధాని విషయంలో సీఎం జగన్‌ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై శివరామకృష్ణ కమిటీ చేసిన సూచలను జీవీఎల్‌ ప్రస్తావించారు. ‘ శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పింది. అయితే గత ప్రభుత్వం రిపోర్టులు, గ్రాఫిక్స్‌కే పరిమితమైంది. చంద్రబాబు కూడా గతంలో నారాయణ కమిటీని నియమించి అమరావతిలో నిర్మాణం చేపట్టారు. అధికార వికేంద్రీకరణను పట్టించుకోలేదు. దీంతో సీమాంధ్ర చాలా నష్టపోయింది. నిజానికి ఒకేచోట రాజధాని నిర్మాణంతో అభివృద్ధి జరగదు’ అని అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌ విషయంలో చేసిన తప్పును పునరావృతం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.(ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!)

అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిసర ప్రాంతాల్లో జరిగిన భారీ అవినీతి గురించి మాట్లాడుతూ.. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని టీడీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చి నిర్ణయం తీసుకోవాలి’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు. అదే విధంగా శివరామకృష్ణ కమిటీ సూచలను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement