50 లక్షల సిబ్బంది, 50 వేల కోట్ల ఖర్చు | Indian Elections World Most Expensive Exercise | Sakshi
Sakshi News home page

భారత ఎన్నికలు బాగా ఖరీదైనవి

Published Sat, Apr 6 2019 7:53 AM | Last Updated on Sat, Apr 6 2019 7:53 AM

Indian Elections World Most Expensive Exercise - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు వచ్చాయంటే మూడు నెలల పాటు సందడే సందడి. సభలు సమావేశాలతో రాజకీయ నాయకులు ఓ పక్క హోరెత్తిస్తుంటే, మరో పక్క మాకేం ఇచ్చావ్‌? మాకేం ఇస్తాం! అంటూ నిలదీసే ప్రజలు. ఓటర్లను ఆకర్షించడం కోసం ఎన్నికల ప్రచారంలో విందులు, వినోదాలు కూడా చోటు చేసుకోవడంతో ఎన్నికలకు ఓట్ల పండుగ అని కూడా పేరొచ్చింది. సహజంగా ఎన్నికలు వచ్చాయంటే ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది ? ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు ? ఎందుకు? అన్న సమాచారం, విశ్లేషణల వరకే చాలా మంది ఓటర్లము పరిమితం అవుతాం. కానీ ఇంత పెద్ద క్రతువు  నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎంత పెద్ద కసరత్తు చేస్తుంది ? దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్‌లో ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారు ? శాశ్వతంగా ఉండే సిబ్బంది ఎంత ? ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసే ఉద్యోగులు ఎంత ? మూడు నెలల ముందుగా వచ్చి చేరే ఉద్యోగులు ఎంత మంది ? కేవలం మూడు రోజుల ముందుగానే ఎన్నికల విధుల్లో చేరి పోలింగ్‌ నిర్వహించే వారు ఎంత మంది ? వారు ఎక్కడ నుంచి వస్తారు ? ఎన్నికల నిఘా విభాగంలో ఎంత మంది పనిచేస్తారు ? వారు ఎక్కడి నుంచి వస్తారు. ? సిక్యూరిటీకి ఎన్ని బటాలియన్ల సైనికులు కావాలి ? దాదాపు ఎన్నికల నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది ? తెలుసుకోవాలంటే ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలే. 

ఎన్నికల ప్రక్రియ మూడు నెలలు
కేంద్ర ఎన్నికల కమిషన్‌ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపు 45 రోజుల నుంచి 90 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. ఈసారి దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. వారి కోసం దేశవ్యాప్తంగా 10,35,918 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలో దాదాపు 400 మంది అధికారులు ఉన్నారు. రాష్ట్రాల స్థాయిలో ప్రధాన ఎన్నికల అధికారులు ఉంటారు. వారికి ఆ రాష్ట్రంలోని నియోజకవర్గాల సంఖ్యను బట్టి అదనంగా సిబ్బంది ఉంటారు. 

ముగ్గురు ఎన్నికల కమిషనర్లు
ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’లో ఓ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు ఉంటారు. సీనియర్‌ బ్యూరోక్రట్లనే ఈ పదవుల్లో నియమిస్తారు. వారికో సెక్రటేరియట్‌ ఉంటుంది. అందులో నేరుగా కమిషన్‌ నియమించుకున్న ఉద్యోగులు ఉంటారు. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి బదిలీ ద్వారా తెచ్చుకున్న వారు ఉంటారు. కమిషనర్లు ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయడంతోపాటు వివిధ పార్టీలతో చర్చలు జరిపి ఎన్నికల కోడ్‌ను నిర్ణయిస్తారు. దేశవ్యాప్తంగా ఓటర్ల నమోదు, వారి ఫిర్యాదుల నుంచి మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ జనరల్‌ అబ్జర్వర్లను, ఎక్స్‌పెండీచర్‌ అబ్జర్లర్లను డిప్యూటీ చేయడంతోపాటు రాష్ట్రాలకు పోలీసు అబ్జర్వర్లను నియమిస్తుంది. అభ్యర్థుల ఖర్చును పర్యవేక్షించే కమిటీలను ఏర్పాటు చేస్తుంది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల కోడ్‌ పర్యవేక్షక సిబ్బంది కూడా నియమిస్తుంది. 

చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌
కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్రాల స్థాయిలో ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌) ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ పదవిలో సీనియర్‌ బ్యూరోక్రట్‌ను నియమిస్తారు. ఆయన కింద పలువురు ప్రత్యేక, డిప్యూటీ ఎన్నికల అధికారులు ఉంటారు. వారు డిప్యూటేషన్‌పై నోడల్‌ అధికారులను తెచ్చుకుంటారు. వారు ఓటర్ల నమోదు, ఫిర్యాదుల వ్యవహారాలను చూడడమే కాకుండా రాజకీయ పార్టీలకు ఎన్నికల పట్ల అవగాహన కల్పిస్తారు. ఎన్నికల ప్రచార సామాగ్రిని అనుమతించడం దగ్గరి నుంచి ఎన్నికల కోడ్, మీడియా పర్యవేక్షణ చూస్తారు. ఈ నోడల్‌ ఆఫీసర్లను ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం కంటే ముందే వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై తెప్పిస్తారు. ఇక్కడ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వేరు, స్టేట్‌ ఎన్నికల కమిషన్‌ వేరు. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే స్టేట్‌ ఎన్నికల కమిషన్‌లు స్థానిక ఎన్నికల నిర్వహణకే పరిమితం అవుతాయి.

జిల్లా ఎన్నికల అధికారి
జిల్లా ఎన్నికల అధికారి సాధారణంగా జిల్లా మేజిస్ట్రేట్‌ లేదా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. తన జిల్లా పరిధిలో పోలింగ్‌ బూత్‌లను గుర్తించి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడంతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను, ఓటర్లను తరలించడానికి వీల్‌ చైర్లను, అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటారు. 

రిటర్నింగ్‌ అధికారి
రిటర్నింగ్‌ అధికారిగా కూడా సాధారణంగా కలెక్టరే వ్యవహరిస్తారు. అయితే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం లేదా అసెంబ్లీ ఎన్నికలకు బాధ్యత వహిస్తారు. అర్హులైన ఓటర్ల జాబితాను ప్రకటించడం నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించడం, వాటిని స్క్రూటినీ చేయడం సహా కౌంటింగ్‌ వరకు అన్ని వ్యవహారాలకు బాధ్యత వహిస్తారు. ఓ పార్లమెంట్‌ నియోజకం పరిధిలో పలువురు జిల్లా ఎన్నికల అధికారులు ఉండవచ్చుగానీ రిటర్నింగ్‌ అధికారి మాత్రం ఒక్కరే ఉంటారు.

అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి 
ఈ బాధ్యతలను సబ్‌ డివిజనల్‌ అధికారి లేదా అదనపు మేజిస్ట్రేట్‌ నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి వీరికి రిటర్నింగ్‌ అధికారి విధులను, బాధ్యతలను అప్పగిస్తారు. 

ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి
అడిషనల్‌ లేదా సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఉంటారు. ఓటర్ల జాబితాలను రూపొందించడం ఆయన బాధ్యత. అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా స్థానిక తహసిల్దార్‌ వ్యవహరిస్తారు. ఓటర్ల నమోదు కార్యక్రమం విషయంలో ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారికి సహకరిస్తారు. వీరు ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒకరు చొప్పున ఉంటారు. ఢిల్లీలో శాశ్వత ప్రాతిపదికపై ఎన్నికల విధులను నిర్వర్తించే వీరు రాష్ట్రాల్లో తాత్కాలిక ప్రాతిపదికపైనే ఎన్నికల విధులు నిర్వర్తిస్తారు. 

కోడ్‌ ఉల్లంఘనల పర్యవేక్షణ 
కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించిన అన్ని రకాల పర్యవేక్షణా వ్యవస్థలు ‘రిటర్నింగ్‌ అధికారి’ పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఇక్కడ పనిచేసే అధికారులకు రాష్ట్ర, కేంద్ర సిబ్బందితో కూడిన కంట్రోల్‌ రూమ్‌లు ఉంటాయి. కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు ఉల్లంఘనలపై చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదలను స్వీకరించేందుకు ఈసారి ‘మొబైల్‌ యాప్‌’ను కూడా ప్రవేశపెట్టారు. 

జనరల్‌ పరిశీలకులు
ఎన్నికల జనరల్‌ పరిశీలకులుగా ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఒకరు ఉంటారు. ఈహోదాలో సీనియర్‌ బ్యూరోక్రట్‌నుగానీ, సీనియర్‌ పోలీసు అధికారినిగానీ నియమిస్తారు. సాధరణంగా వీరిని ఇతర రాష్ట్రాల నుంచి డిప్యూటీపై తెచ్చుకుంటారు. వీరి కింద ఎక్స్‌పెండీచర్‌ పరిశీలకులు ఉంటారు. ఎన్నికల కోడ్‌తోపాటు అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పరిశీలించేందుకు ఫ్లైయింగ్‌ స్కాడ్‌లు, పర్యవేక్షక కమిటీలు, ప్రత్యక్ష ఖర్చు పరిశీలకు, వీడియో నిఘా కమిటీలు విడి విడిగా పనిచేస్తూ రిటర్నింగ్‌ అధికారికి జవాబుదారిగా ఉంటాయి. ఇక మైక్రో పరిశీలకులను వారం రోజుల ముందు తీసుకుంటారు. 2014 ఎన్నికల సందర్భంగా 1,51,417 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. 

పోలింగ్‌ సిబ్బంది
ప్రతి పోలింగ్‌ బూత్‌లో పనిచేసే పోలింగ్‌ సిబ్బందిని కేవలం మూడు రోజులు ముందుగా తీసుకుంటారు. వారంతా విధిగా ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. స్కూల్‌ టీచర్లు, జూనియర్‌ ఇంజనీర్లు, ఆ సమానమైన హోదా కలిగిన ఇతర ప్రభుత్వ సిబ్బందిని తీసుకుంటారు. వారికి హెల్పర్‌గా ఫోర్త్‌క్లాస్‌ ఉద్యోగి ఉంటారు. సాధారణంగా ఐదుగురు ఉండే ఈ బృందంలో టీచర్లనే పోలింగ్‌ అధికారులుగా నియమిస్తారు. 

సెక్టార్‌ అధికారులు
ప్రతి పది నుంచి 15 పోలింగ్‌ బూత్‌లను పర్యవేక్షించేందుకు సెక్టార్‌ అధికారులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను నియమిస్తారు. 

రన్నర్లు కూడా ఉంటారు
ఎన్నికల కమిషన్‌ శాశ్వత ప్రాతిపదికన లేదా తాత్కాలిక ప్రాతిపదికన ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న ప్రతి అధికారి పేరు, ఫోన్‌ నెంబర్‌ను ముందుగానే వెల్లడిస్తుంది. సమాచార వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అంటే, మొబైల్, ల్యాండ్‌లైన్‌ ఫోన్లు పనిచేనప్పుడు ఒక చోటు నుంచి మరోచోటుకు సమాచారాన్ని చేరవేసేందుకు ‘రన్నర్ల’ను నియమిస్తుంది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ 3,81,572 మంది రన్నర్లను నియమించింది. ఎన్నికల సందర్భంగా శాశ్వత, తాత్కాలిక సిబ్బంది సహా దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తారు. 

భద్రతా సిబ్బంది 
2014లో జరిగిన ఎన్నికల భద్రత కోసం 1155 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను నియమించారు. వారి రవాణా కోసం 234 ప్రత్యేక రైళ్లును నడిపారు. గతంకన్నా ఈసారి ఎక్కువ బలగాలు అవసరం అవుతాయని అంచనా వేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిర్వహణ కు దాదాపు 42 వేల కోట్ల రూపాయలు ఖర్చుకాగా, ఈసారి ఎన్నికలకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికా సెనేట్, అధ్యక్ష ఎన్నికల ఖర్చును దాటిపోతోందని విమర్శిస్తున్న వారు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement