సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘కాంగ్రెస్, బీజేపీల పాలనతో దేశ ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. ఇండియాలో కొత్త ఆలోచనలు పుట్టాలి. 73 ఏళ్లు దేశాన్ని పాలించిన ఈ రెండు పార్టీలు ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లను పెడితే దేశం వెలిగిపోయేది కదా.. ఎందుకు పెట్టలేదు? దేశం ఎందుకు వెలిగిపోవడంలేదని ప్రశ్నిస్తే నన్ను నిందిస్తున్నారు. నాపై దాడి చేస్తున్నారు. చంపుతానన్నా నేను భయపడను. దేశం బాగుపడాలంటే అవసరమైన మార్పులన్నీ చేసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలి’’ అని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. 65 ఏళ్ల పాలనలో మొరార్జీదేశాయ్, చరణ్‌సింగ్, వీపీసింగ్, ఐకే గుజ్రాల్‌లు ఐదారేళ్లు పాలిస్తే ఈ రెండు పార్టీలు వారిని దించేశాయని విమర్శించారు. దేశంలో నూతన ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలని.. రైతుబంధు, రైతుబీమా దేశమంతా అమలు కావాలని పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరపతి పెరగాలని, రాజ్యాంగంలో ప్రబలమైన మార్పులు రావాలని, న్యాయ పాలనలోనూ మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో దేశం కునారిల్లే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కరీంనగర్ బహిరంగసభలో తాను మాట్లాడిన నాటి నుంచి తనను నిందిస్తున్నారని, సోషల్ మీడియాలో గ్రూపులను ఏర్పాటు చేసి దూషిస్తున్నారని దుయ్యబట్టారు. కొన్ని విషయాలపై గట్టిగా నిలదీస్తే కాంగ్రెస్, బీజేపీలు తనపై ఒంటికాలిపై లేస్తున్నాయని ఆరోపించారు. మోదీ, రాహుల్ పరస్పరం విమర్శించుకుంటున్నారని.. వీరిలో మార్పు రాదని దుయ్యబట్టారు.
బీజేపీది రాజకీయ హిందుత్వం..
బీజేపీది రాజకీయ హిందుత్వమని, తమది నిజమైన హిందుత్వమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తమది దేవుణ్ని నమ్మే హిందుత్వమని, బీజేపీది డూప్లికేట్ హిందుత్వమని విమర్శించారు. ‘‘కేసీఆర్ నువ్వు కూడా హిందువువా అని ప్రశ్నిస్తున్నారు. రామ జన్మభూమిపై మీ వైఖరేంటో చెప్పాలని లక్ష్మణ్ అంటున్నారు. ముందు మీది రాజకీయ పార్టీనా.. మత ప్రచార పార్టీనా అనేది స్పష్టం చేయాలి. రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి.. సత్యభామ జన్మభూమి.. శూర్పనక జన్మభూమి.. ఈ జన్మభూముల పంచాయితీలన్నీ శృంగేరి పీఠం శంకరాచార్యులు, చినజీయరు వంటి స్వాములు, పీఠాధిపతులు చేయాలి కానీ రాజకీయ పార్టీలు కాదు. రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలు పరిష్కరించాలి.. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీళ్లు ఇవ్వాలి. జన్మభూములతో ప్రజల జాతకాలు మారవు. పనికిమాలిన కథలు చెప్పడం కాదు.. జన్మభూమి పంచాయితీ చెప్పడం కాదు.. రెండు వర్గాలకు పంచాయితీ ఉంటే సుప్రీంకోర్టు తేలుస్తది. మాట్లాడితే హిందువా అని అడుగుతున్నారు. పిల్లలు పుడితే మేము 21 దినం చేసుకుంటలేమా? గుడులకు పోతలేమా.. గుండుకొట్టించుకోవడం లేదా? ఇతర మతాలను తిట్టేవాడే హిందువని మీరు చెబుతున్నారు. ఇక మీ ఆటలు సాగవు.. చిల్లర రాజకీయాల కోసమే ఇలా మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయ ఎజెండాలు తీసుకోవాలి.. హిందుత్వంలో ఇతర మతాలను తిట్టాలని ఎక్కడా చెప్పలేదు.. ఓట్ల రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోవద్దు’’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
కరీంనగర్ మాటలకు పీఠాలు కదులుతున్నాయి..
కరీంనగర్ బహిరంగసభలో తాను చెప్పిన మాటలకు కాంగ్రెస్, బీజేపీలకు పీఠాలు కదిలాయని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచులు తెలంగాణలో కలుస్తామని వచ్చారని, దీన్ని బట్టి దేశంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. 73 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరితే ఇప్పటివరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకోలేదని మండిపడ్డారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీసీ నేత ఆర్.కృష్ణయ్యతో కలిసి పలుమార్లు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిశానని గుర్తు చేశారు. మోదీ కూడా ఈ శాఖను ఏర్పాటు చేయలేదన్నారు. తాను మాత్రం ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా సంచార జాతులకు రుణాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వడం లేదని కేసీఆర్ విమర్శించారు. దేశంలో 52.32 లక్షల మంది బీడీ కార్మికులున్నారని, తెలంగాణలో 4.50 లక్షల మంది ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వాలు బీడీ కార్మికుల బాధలను పట్టించుకోలేదని, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎక్కడా ఈ పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. బీడీ కార్మికులు, రైతుల గోస ఈ రెండు పార్టీలకు పట్టడం లేదని విమర్శించారు.
డైలాగులు కొడితే రైతు రాజ్యం రాదు..
డైలాగులు కొడితే రైతు రాజ్యం రాదని, రైతు రాజు కాలేడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, పట్టాదారు పాసుపుస్తకాలు, గిట్టుబాటు ధర అందితేనే రైతు రాజ్యం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఎన్నికల తర్వాత రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుందని తెలిపారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయడం, రైతు సంఘాలతో ఈ ఉత్పత్తుల సేకరణ, ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పసుపు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి మార్కెట్‌లో కల్తీ లేని పసుపును దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తామని వివరించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.ఐదు లక్షల శిలక్ ఉండేలా చూస్తామని స్పష్టంచేశారు.
ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తాం..
ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎర్రజొన్నకు ధర రావడం లేదన్న అంశం తన దృష్టికి వచ్చిందని, చెప్పుడు మాటలతో రైతుల ఆగం కావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రెచ్చగొడుతున్న వారెవరూ తర్వాత రైతుల వెంట ఉండరని.. టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలే రైతుల పక్షాన ఉంటారనే విషయాన్ని గమనించాలని సూచించారు. ఎర్రజొన్న బకాయిల కోసం ఉద్యమం చేస్తే ఫైరింగ్ చేసిన ఘటనను గుర్తు చేసిన కేసీఆర్.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎర్రజొన్న రైతులకు రూ.10.50 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. అటవీ భూముల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
సాగునీరు ఎందుకివ్వలేదు..
‘‘ఏ దేశానికి లేని వరం.. భగవంతుడు, ప్రకృతి మన దేశానికి ఇచ్చింది. 70 వేల టీఎంసీల నీళ్లున్నాయి.. 40 కోట్ల ఎకరాల భూమి ఉంది. 73 ఏళ్లు గడుస్తున్నా రైతులు సాగునీటికి నోచుకోలేదు. దేశానికి జలవిధానం లేదు. ప్రాజెక్టులు కట్టరు. ట్రిబ్యునల్ తీర్పులు రావు. సాగునీరిచ్చే తెలివి లేదు. ఇవి మారాలని కోరుతున్నా. సమూల మార్పులు రావాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలతో పథకాల పేర్లు మారతాయే తప్ప.. ప్రజల తలరాతలు మారవన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉంటే జవహర్ రోజ్‌గార్ యోజన, ఇందిరా రోజ్‌గార్ యోజన, రాజీవ్ రోజ్‌గార్ యోజన, మన్ను యోజన.. బీజేపీ అధికారంలో ఉంటే దీన్‌దయాల్, శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఇలా పేర్లు మారతాయే తప్ప ప్రజల తలరాతలు మారవని పేర్కొన్నారు.
సింగపూర్‌లో అలా.. ఇక్కడ ఇలా...
దేశ ప్రజల గురించి ఆలోచించే పాలన జరగడం లేదని విమర్శించిన కేసీఆర్.. దేశంలో 130 కోట్ల జనాభా ఉన్నా, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. 190 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ 3 కోట్ల కంటెయినర్లను షిప్పింగ్ చేస్తే.. 7వేల కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న మన దేశం 50 లక్షల కంటెయినర్లను కూడా ఎగుమతి, దిగుమతి చేయడంలేదని వివరించారు. లారీల సరుకు రవాణా కూడా 50 కిలోమీటర్ల వేగానికే పరిమితమవుతోంద న్నారు. జపాన్, అమెరికా, చైనా వంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మన దేశం ఎందుకు బాగుపడంలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎవరో ఒకరు పొలికేక పెడితేనే, గర్జిస్తేనే దేశ దరిద్రం పోతుందని పేర్కొన్నారు.
కరెంట్ వాడుకునే తెలివి లేదు..
దేశంలో ఉన్న విద్యుత్‌ను వాడుకునే తెలివి ఈ రెండు పార్టీలకు లేదని కేసీఆర్ విమర్శించారు. దేశంలో 3.44 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉంటే.. 1.80 లక్షల మెగావాట్లకు మించి విద్యుత్ వాడకం జరగడం లేదని వివరించారు. ‘‘సగం దేశం చీకట్లో ఉంది.. 16 రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఐదారు గంటలకు మించి ఇవ్వడం లేదు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీల నేతలు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు తమ చిల్లర రాజకీయాల కోసం రాష్ట్రాల హక్కులను హరించాయని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘‘అధికారం కోసం పబ్బం గడుపుకున్నాయి. విద్య, అడవులు, న్యాయపాలన రాష్ట్రం హక్కులుగా ఉండేవి. 42వ రాజ్యాంగసవరణ ద్వారా వాటిని కేంద్రం పరిధిలోకి మార్చారు. మారుమూల గ్రామాల్లో పనిచేసేవారికి ఢిల్లీ నుంచి కూలీ ఇస్తే.. ఇక్కడ సర్పంచులు ఎందుకు, ఇతర స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు ఎందుకు’’ అని ఆయన ప్రశ్నించారు.
బండి ముందుకెళ్లాలంటే...
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా 16 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘‘మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారు. ఒకవైపు ఎద్దును.. మరోవైపు దున్నపోతును కడితే బండి ముందుకెళ్లదు.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించినట్లుగానే.. ఈ ఎన్నికల్లో ఎంపీలను కూడా గెలిపిస్తేనే బండి ముందుకెళుతుంది. ఆ శక్తితో రాష్ట్రాన్ని, దేశాన్ని బాగుచేద్దాం. ఇందుకు మీ దీవెన, సహకారం కావాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈనెల 21న ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థులెవరైనా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో హోంమంత్రి మహమూద్ అలీ, పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, పార్టీ జిల్లా ఇన్‌చార్జి తుల ఉమ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, షకీల్ ఆమేర్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్, గంప గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment