
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిద్ధాంతాలకు కత్తి మహేష్ తనదైన శైలిలో కామెంట్ చేశారు. జనసేన సిద్ధాంతాలు మనం ప్రతి రోజు స్కూల్‌లో చెప్పే ప్రతిజ్ఞలాగా ఉన్నాయన్నారు.
‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులుని కాపాడే సమాజం, ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం, ఇవి దేశపటిష్టతకు మూలాలు’ ఇవే జనసేన సిద్ధాంతాలు అని నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
దీనికి కత్తి మహేష్ ‘‘మనం స్కూల్ లో ప్రతిరోజు చెప్పిన ప్రతిజ్ఞ లాగా లేదూ! ఆశయాలు సరే...ఆచరణ ఎలా?’. ‘ప్రపంచ శాంతిని కోరడాలు, సర్వమత సామరస్యం కావాలి అనడాలు, కులమత భేదాలు సమసి పోవాలి అనే నినాదాలు, భాష సంస్కృతి వర్ధిల్లాలి అని ఆకాంక్షించడాలు, భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ తత్వం అని చాటడాలు’. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదే. మరి జనసేన కొత్తగా చెప్పింది ఏమిటి? బీజేపీ, తెలుగుదేశంతో కలిపి ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఎలా సాధిస్తాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే...మీ తల వెయ్యి ముక్కలు అవుతుంది!!!’ అని కామెంట్ చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే.