కోల్‌కతా : ప్రధాని పేరు తెలియక పోవడం కూడా నేరంగా మారింది. అదే ఓ అమాయకుడైన ప్రయాణికుడిపై దాడికి కారణమయ్యింది. ముక్కూ మొహం తెలియని తోటి ప్రయాణీకులు ప్రధాని పేరేమిటన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఓ మైనారిటీ వ్యక్తిపై దాడికి తెగబడ్డ ఘటన పశ్చింబెంగాల్‌లోని ఓ రైలులో జరిగింది. వలస కూలీ అయిన బాధితుడు హౌరా నుంచి మాల్దా జిల్లా కాలియాచక్‌కి వెళుతుండగా రైల్లో తన పక్కసీట్లో కూర్చుని వున్న నలుగురు వ్యక్తులు భారత ప్రధాని పేరేమిటి అని ప్రశ్నించడంతో అక్షరం ముక్కరాని ఆ ప్రయాణికుడు బిక్కమొహం వేసాడు.
గుచ్చి గుచ్చి అగడగడంతో తనకు తెలిసిన ఒకే ఒక పేరు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీయే మన ప్రధాని అని సమాధానమిచ్చాడా నిరక్షరాస్యుడు. దీంతో మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? మన రాష్ట్రపతి పేరేమిటి అంటూ ఆ తరువాత కూడా ఆ నలుగురూ ప్రశ్నలతో వేధించడమే కాకుండా అతని పై చేయిచేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా జాతీయగీతాన్ని ఆలపించమని ఆ నలుగురూ ఒత్తిడిచేయడంతో తనకు తెలిసినంతవరకూ భయం భయంగా పాడివినిపించాడా వ్యక్తి. దీంతో ‘‘నీకు నమాజ్ చదవడం తెలుసు కదా? మరి జాతీయ గీతం ఎందుకు రాదు?’’ అని నిలదీయడం, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి తెలుసా అంటూ ఎద్దేవా చేయడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. బందేల్ స్టేషన్ లో ఆ అగంతకులు దిగిపోయినట్టు పోలీసు అధికారులు తెలియజేసారు. బంగ్లా సంస్కృతి మంచ్ స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రయాణికుడిపై దాడి ఘటన వీడియో ఆధారంగా కాలియచక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుమన్ చటర్జీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment