
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ చేసిన వాఖ్యలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే, ఎంపీల ఫిరాయింపుపై చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదేనన్నారు. చట్టాన్ని తెస్తే స్వాగతిస్తామని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే శివసేన నేత సురేష్ ప్రభును మంత్రి వర్గంలోకి తీసుకోలేదా అని ప్రశ్నించారు. చట్టాన్ని తీసుకురావాల్సింది ఎన్డీయే ప్రభుత్వమేనని మండిపడ్డారు.
తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లో ఇదే విధంగా పార్టీలు ఫిరాయించిన ప్రజా ప్రతినిధులు ఉన్నారని..వాటి మాటేమిటని ఎదురు ప్రశ్నించారు. అంతకుముందు ఉక్కు పరిశ్రమ, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నియోజకవర్గ నేతలతో మంత్రులు చర్చించారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రంలోని పెద్దలతో సీఎం చర్చించారని సోమిరెడ్డి తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఈక్విటీ షేర్ ఇవ్వడానికి సీఎం సంసిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూల పరిస్థితి ఉందని చెప్పారు.