కుబేర మంత్రి వర్సెస్‌ సామాన్యు​డు | Nellore Constituency Review | Sakshi
Sakshi News home page

‘నెల్లూరు’పైనే నజర్‌

Published Sun, Mar 24 2019 8:10 AM | Last Updated on Sun, Mar 24 2019 2:08 PM

Nellore Constituency Review - Sakshi

నెల్లూరు నగరంలో ఈసారి జరిగే ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ పర్యాయం ఉత్కంఠగా ఈ ఎన్నికలు జరగుతున్నాయి. నిరంతరం జన క్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పనిచేస్తుండగా సమీక్షలు, హడావుడి చేస్తూ ధనదర్పంతో మంత్రి నారాయణ హడావుడి చేస్తూ ప్రత్యక్ష ఎన్నికల బరిలో మొదటి సారిగా నిలిచారు. ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, గతంలో దివంగత వైఎస్సార్‌ హయాంలో ఆయన అనుచరులకే ఎక్కువ పర్యాయాలు పట్టం కట్టిన నగరంగా నెల్లూరు గుర్తింపు పొందింది. దీంతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. అంతేకాక నెల్లూరు నగర రాజకీయాల్లో ఆనం కుటుంబానిది ప్రత్యేకమైన ముద్ర. ప్రధానంగా 1955 నుంచి 2009 వరకు  ఆనం కుటుంబానికి చెందిన నలుగురు ఐదు పర్యాయాలు నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నెల్లూరు నగరం 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో రూపుమార్చుకుంది. 

సమస్యలపై అనిల్‌ రాజీలేని పోరు
నెల్లూరు నగర నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే అనిల్‌ రాజీలేని పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా రైల్వే లైను పనుల నేపథ్యంలో నియోజకవర్గంలో 1500 ఇళ్లను నోటీసులు కూడా ఇవ్వకుండా తొలగించటానికి రైల్వే, రెవెన్యూ యంత్రాంగం అడ్డుకుంటే ప్రజల పక్షాన నిలిచి ప్రజాపోరాటం చేశారు. చివరకు హైకోర్టుకు వెళ్ళిఇళ్ళు కూల గొట్టటానికి వీల్లేదని కోర్టు స్టే ఆర్డర్‌ తీసుకువచ్చారు. అలాగే నెల్లూరు నగరంలో మున్సిపల్‌ శాఖలో జీఓ నెంబర్‌ 279 ద్వారా 2 వేల మంది కార్మికుల కడుపు కొట్టడానికి మంత్రి నారాయణ యత్నిస్తే దాదాపు 15 రోజుల పాటు పోరాటం చేసి హైకోర్టు ద్వారా జిఓ నెంబర్‌ 279 నెల్లూరు నగరంలో అమలు కాకుండా స్టే తీసుకువచ్చారు. మంత్రి నారాయణ హడావుడి అభివృద్ధి పేరుతో కాల్వల గట్టుపై ఉన్న ఇళ్ళను కూలగొట్టడానికి అర్ధరాత్రి యత్నిస్తే దానిపై పోరాటం చేశారు. ఇలా వరుస ప్రజా పోరాటాలతో పాటు, యువత సమస్యలపై ఎక్కువగా పోరాడుతూ మాస్‌లీడర్‌గా అనిల్‌ ముందుకు సాగుతున్నారు. 

ఎన్నికల ముందు నెల్లూరులో నారాయణ
మంత్రి నారాయణ ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచీ నగరంపై దృష్టి సారించారు. అభివృద్ధి అంటూ అధికార పార్టీ నేతలకు భారీగా దోచిపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే టీడీపీ వర్గపోరు, గ్రూప్‌ వివాదాలు, మంత్రి పాతతరం నేతల్ని కలుపుకు వెళ్ళని క్రమంలో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రచారం సాగిస్తున్నారు. పూర్తిగా మురికివాడల్లోకి మంత్రి నారాయణ వెళ్లలేకపోవడం పార్టీకి ఇబ్బందికర పరిణామం. వేల కోట్లు డబ్బున్న మంత్రి నారాయణకు, సామాన్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి మధ్య సాగుతున్న పోరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా ఉంది. మరోవైపు అడ్డదారుల్లో గెలవటానికి నగరంలో సుమారు 50 వేలకు పైగా ఓట్లను తొలగించారు.


14 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది రెండుసార్లే..
1952లో ఆవిర్భవించిన నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 ఎన్నికలు జరగ్గా  2009 ముందు వరకు కాంగ్రెస్‌ పార్టీ 7 సార్లు, భారతీయ జనసంఘ్‌ ఒక్కసారి, తెలుగుదేశం పార్టీ రెండు పర్యాయాలు, పీఆర్‌పీఒక్క సారి, ఇండిపెండెంట్లు రెండు సార్లు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకసారి విజయం సాధించాయి. నెల్లూరు నగరం దివంగత వైఎస్సార్‌ అభిమానులతోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం. ముఖ్యంగా గతంలో నెల్లూరు నగరంపై ఆనం కుటుంబం పట్టు బలంగా ఉంది.  ఆనం కుటుంబంలో ఆనం వివేకానందరెడ్డి మినహా  మిగతావారు (ఆనం చంచు సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి) మంత్రులుగా పనిచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement