పార్టీలతో ప్రమేయం లేకుండా సమరమే..! | Political Successors In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పార్టీలతో ప్రమేయం లేకుండా సమరమే..!

Published Sun, Mar 24 2019 9:03 AM | Last Updated on Sun, Mar 24 2019 9:45 AM

Political Successors In Andhra Pradesh - Sakshi

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలకు చెందిన నేతలు వరుసగా పోటీలో నిలుస్తున్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా కుటుంబ ప్రతిష్ట, ప్రజల్లో ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌తో ఆయా కుటుంబాల్లోని నేతలు వరుసగా బరిలో ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ కొన్ని నియోజక వర్గాల్లో అదే దృశ్యం కనిపిస్తోంది. పార్టీలు వేరైనా ఇలాంటి కుటుంబాలు దాదాపు 30దాకా ఉంటాయి. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహించిన వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబం ఆ ప్రాంత ప్రజలకు సేవలందిస్తుంది. అదే తీరున అక్కడి ప్రజలు కూడా వైఎస్‌ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. పార్టీలకు అతీతంగా వైఎస్‌ కుటుంబాన్ని అక్కడి ప్రజలు ఎంతో ఆదరణతో గెలిపిస్తూ వస్తున్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి రికార్డు నెలకొల్పిన ఘనత కూడా పులివెందుల ప్రజలకే దక్కుతోంది.
– సాక్షి, అమరావతి

ఆళ్లగడ్డలో 3 కుటుంబాల మధ్య..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 1967 నుంచి మూడు కుటుంబాల మధ్య పోటీ జరుగుతోంది. గంగుల, ఎస్వీ, భూమా కుటుంబాలు పోటీపడుతున్నాయి. గంగుల తిమ్మారెడ్డి 1967లో ఎస్వీ సుబ్బారెడ్డిని ఓడిస్తే ఆ తర్వాత తిమ్మారెడ్డిని సుబ్బారెడ్డి ఓడించారు. సుబ్బారెడ్డి అల్లుడు భూమా నాగిరెడ్డి రెండుసార్లు ఇక్కడినుంచి గెలిపారు. ఆయన నంద్యాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడు ఎస్వీ మోహన్‌రెడ్డి 2014లో కర్నూలు నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో టీడీపీ తరఫున భూమా అఖిలప్రియ, వైఎస్సార్‌సీపీ నుంచి గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి పోటీపడుతున్నారు. 

పాణ్యం: గతంలో పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి ఈసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడినుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఐదుసార్లు గెలిచారు. ఈసారి ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున  పోటీ చేస్తున్నారు. 


డోన్‌: ఇక్కడ కేఈ కుటుంబం, కోట్ల కుటుంబాలు పోటీపడుతూ వచ్చాయి. డోన్‌ నుంచి.. ఆ తర్వాత పత్తికొండ నుంచి పోటీచేసిన కేఈ కృష్ణమూర్తి ఆరుసార్లు గెలుపొందారు. ఒకసారి కర్నూలు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇదే కుటుంబం నుంచి కేఈ ప్రభాకర్‌ రెండుసార్లు గెలవగా, కేఈ ప్రతాప్‌ రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. డోన్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఒకసారి గెలుపొందారు. పాణ్యం, ఎమ్మిగనూరు నుంచి కూడా కోట్ల పోటీచేసి మూడుసార్లు గెలిచారు. ఆయన కోడలు కోట్ల సుజాతమ్మ డోన్‌ నుంచి 2004లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలిచారు. కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి మూడుసార్లు కర్నూలు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం డోన్‌ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున 2014లో విజయం సాధించిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రెండోసారి పోటీచేస్తున్నారు. టీడీపీ తరఫున కేఈ ప్రతాప్‌ పోటీపడుతున్నారు.


ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నుంచి బీవీ మోహన్‌రెడ్డి ఐదుసార్లు గెలుపొందగా ఆయన కుమారుడు బి.జయనాగేశ్వరరెడ్డి ఒకసారి గెలిచారు. మాజీ ఎమ్మెల్యే కె.చెన్నకేశవరెడ్డి రెండుసార్లు వైఎస్సార్‌ సీపీ తరఫున గెలవగా ఈసారి మళ్లీ ఆయనే పోటీచేస్తున్నారు.

సిక్కోలులో కింజరాపు, గౌతు, కిమిడి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి కింజరాపు యర్రంనాయుడి కుటుంబీకుల వారసత్వం టీడీపీలో కొనసాగుతోంది. పునర్విభజన జరగక ముందు 2009 వరకు ఇది హరిశ్చంద్రాపురం పేరుతో కొనసాగేది. అప్పట్లో ఇక్కడినుంచి యర్రంన్నాయుడు నాలుగుసార్లు గెలవగా ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు మూడుసార్లు గెలిచారు. యర్రంన్నాయుడు శ్రీకాకుళం లోక్‌సభ స్థానంనుంచి నాలుగుసార్లు ఎన్నికయ్యారు. యర్రంన్నాయుడి మరణం తర్వాత ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ పక్షాన టెక్కలి నుంచి పోటీ చేస్తుండగా వైఎస్సార్‌ సీపీ తరపున తిలక్‌ బరిలో నిలిచారు.

పలాస: దీనిలోని పలు ప్రాంతాలు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సోంపేట నియోజకవర్గంగా ఉండేవి. సీనియర్‌ నాయకుడు సర్దార్‌ గౌతు లచ్చన్న ఇక్కడినుంచి ఐదుసార్లు గెలుపొందారు. తర్వాత ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. ప్రస్తుతం శివాజీ కుమార్తె గౌతు శిరీష బరిలో ఉండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున డాక్టర్‌ ఎస్‌. అప్పలరాజు పోటీ చేస్తున్నారు.

ఎచ్చెర్ల: తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు గతంలో ఉణుకూరు నియోజకవర్గం నుంచి, ఆ తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలుపొందారు. ఆయన సోదరుడు గణపతి కూడా ఒకసారి, మరదలు మృణాళిని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా కళావెంక్రటావు ఎచ్చెర్ల నుంచి బరిలో ఉండగా వైఎస్సార్‌ సీపీ నుంచి జి.కిరణ్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు.

విజయనగరంలో రాజాలు
విజయనగరం జిల్లా బొబ్బిలి రాజవంశీకులుగా ఉన్న సుజయకృష్ణ రంగారావు రెండుసార్లు గెలుపొందగా విజయకృష్ణ రంగారావు ఒకసారి గెలిచారు. అంతకుముందు రాజకుటుంబానికి చెందిన ఎస్‌ఆర్‌కె రంగారావు 1967లో గెలిచారు. 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పక్షాన గెలిచిన సుజయకృష్ణ రంగారావు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి మంత్రి పదవిని పొందారు. ఈసారి కూడా ఆయనే టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తుండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తలపడుతున్నారు. 

విజయనగరం: విజయనగరంలో గజపతి రాజకుటుంబానికి చెందిన అశోక్‌గజపతిరాజు ఏడుసార్లు గెలిచారు. లోక్‌సభకు ఒకసారి ఎన్నికయ్యారు. 1978 నుంచి వరుసగా గెల్చిన అశోక్‌గజపతిరాజు 2004లో ఓడిపోయి 2009లో విజయం సాధించారు. అశోక్‌గజపతి రాజు తండ్రి పూసపాటి విజయరామ గజపతిరాజు కూడా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.  రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అశోక్‌ సోదరుడు ఆనంద్‌గజపతి రాజు ఒకసారి శాసనసభకు, రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈసారి అశోక్‌ కుమార్తె అదితి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తలపడుతున్నారు.

‘తూర్పు’లో జ్యోతుల, వరుపుల, తోట
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్వత, ముద్రగడ, వరుపుల కుటుంబాలు వరుసగా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చాయి. ముద్రగడ కుటుంబానికి చెందిన వీరరాఘవరావు రెండుసార్లు గెలుపొందగా ఆయన కుమారుడు పద్మనాభం నాలుగుసార్లు విజయం సాధించారు. పర్వత కుటుంబానికి చెందిన గుర్రాజు 1955లో నెగ్గగా ఆ తర్వాత ఆయన కుమారుడు పర్వత సుబ్బారావు, అనంతరం ఆయన సతీమణి పర్వత బాపనమ్మ, పర్వత సత్యనారాయణమూర్తి గెలిచారు. ఇక వరుపుల కుటుంబం రెండుసార్లు విజయం సాధించింది. ఈసారి టీడీపీనుంచి వరుపుల జోగిరాజు పోటీ చేస్తుండగా వైఎస్సార్‌ సీపీ నుంచి పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌ పోటీ చేస్తున్నారు.

జగ్గంపేట: జగ్గంపేటలో తోట, జ్యోతుల, పంతం కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగుతూ వస్తున్నాయి. గతంలో తోట సుబ్బారావు టీడీపీ తరఫున మూడుసార్లు గెలిచారు. పంతం పద్మనాభం రెండుసార్లు విజయం సాధించారు. ఈయన పెద్దాపురం నియోజకవర్గం నుంచి మరో రెండుసార్లు గెలిచారు. తోట గోపాలకృష్ణ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికై ఒకసారి పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడినుంచి రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి గెలిచిన తోట నరసింహం టీడీపీ తరఫున లోక్‌సభకు గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఇక్కడినుంచి వైఎస్సార్‌ సీపీ తరఫున జ్యోతుల వీరవెంకట విష్ణు సత్యమార్తాండరావు (చంటిబాబు) పోటీ చేస్తుండగా ఆయనతో జ్యోతుల నెహ్రూ తల పడుతున్నారు. జ్యోతుల నెహ్రూ 2014లో వైఎస్సార్‌ సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించడం తెలిసిందే.

‘అనంత’లో జేసీ కుటుంబం
తాడిపత్రిలో జేసీ కుటుంబం నుంచి ఈసారి వారసులు పోటీకి దిగుతున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి ఆరుసార్లు గతంలో ఇక్కడినుంచి గెలిచారు. ఈసారి జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌ అనంతపురం ఎంపీగా, ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతున్నారు. వైఎస్సార్‌ సీపీ నుంచి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా తలారి రంగయ్య పోటీ చేస్తుండగా తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో ఉన్నారు.

రాప్తాడు: గతంలో ఈ ప్రాంతం పెనుకొండ నియోజకవర్గంలో భాగం. పెనుకొండ నుంచి మాజీ మంత్రి పరిటాల రవి నాలుగుసార్లు గెలిచారు. రవి మరణానంతరం అతని సతీమణి పరిటాల సునీత ఉప ఎన్నికలో, ఆ తర్వాత రాప్తాడులో రెండుసార్లు గెలిచారు. ఈసారి పరిటాల కుమారుడు పరిటాల శ్రీరామ్‌ పోటీ చేస్తుండగా వైఎస్సార్‌సీపీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు.

చిత్తూరులో నూతలపాటి, నల్లారి, గాలి...
చిత్తూరు జిల్లా పలమనేరులో నూతలపాటి అమరనాథ్‌రెడ్డి వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. 2014లో నాలుగోసారి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. అమరనాథ్‌రెడ్డి తండ్రి ఎన్‌. రామకృష్ణారెడ్డి పుంగనూరులో మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు చిత్తూరు ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు మళ్లీ అమరనాథ్‌రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి ఎన్‌. వెంకటే గౌడ్‌ పోటీచేస్తున్నారు.

పీలేరు: గతంలో వాయల్పాడు నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడుసార్లు గెలిచారు. ఆయన తండ్రి నల్లారి అమరనాథ్‌రెడ్డి నాలుగుసార్లు వాయల్పాడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడినుంచి చింతల రామచంద్రారెడ్డి మూడుసార్లు గెలిచారు. ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పక్షాన ఒకసారి గెలిచారు. ఈయన తండ్రి సురేంద్రరెడ్డి ఒకసారి గెలుపొందారు. పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడుసార్లు, పుంగనూరు నుంచి రెండుసార్లు గెలుపొందారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.  ప్రస్తుతం పీలేరు నుంచి వైఎస్సార్‌ సీపీ తరఫున చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి బరిలో ఉన్నారు. 

నగరి: గతంలో ఇక్కడినుంచి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఐదుసార్లు గెలుపొందారు. ప్రస్తుతం ఆయన కుమారుడు టీడీపీ పక్షాన  పోటీ చేస్తుండగా 2014లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి తలపడుతున్నారు. 

తిరుగులేని వైఎస్‌ కుటుంబం
వైఎస్సార్‌ జిల్లా పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభా స్థానాల్లో వైఎస్‌ కుటుంబానికి ప్రజలు తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు. పులివెందులలో 1978 నుంచి వైఎస్‌ కుటుంబాన్నే ఆదరిస్తున్నారు. కడప లోక్‌సభా స్థానం నుంచి కూడా వైఎస్‌ కుటుంబమే విజయం సాధిస్తోంది. దేశంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నియోజకవర్గాలుగా ఈ రెండూ రికార్డును సృష్టించాయి.  పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి 2014లో సీమాంధ్రలోనే అత్యధికంగా 75,243 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

2009లో కడప ఎంపీగా గెలిచిన వైఎస్‌ జగన్‌ తన తండ్రి, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణంతో ఏర్పడ్డ పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి కూడా కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించకపోవడంతో ఎంపీ పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. రాజీనామాల అనంతరం జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ 5,45,671 ఓట్ల మెజార్టీతో గెలుపొంది దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన తల్లి విజయమ్మ కూడా అంతకుముందు ఏకగ్రీవంగా ఎన్నికైనా ఉప ఎన్నికల్లో 81,373 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

కాంగ్రెస్, టీడీపీ కుట్రలు పన్ని వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టి అన్యాయంగా జైలుపాలు చేశాయి. ఆ సమయంలో జరిగిన 16 ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబం గెలుస్తూ వస్తోంది. రాజశేఖరరెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి, నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైతే, ఆయన సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి రెండుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 1999లో కాంగ్రెస్‌ తరఫున ప్రతిపక్ష నేతగా ఉంటూ రాష్ట్రంలో 1,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అప్పటికి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్‌ను విజయపథాన నిలిపారు.

ఓటమి ఎరుగని ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లగా పులివెందుల, కడప ఓటర్లే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఆశీర్వదిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం అధికారానికి కూతవేటు దూరంలో ఉండిపోయింది. అధికారంలోకి వచ్చిన టీడీపీకి, వైఎస్సార్‌ సీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం 5 లక్షలే కావడం గమనార్హం. 2014 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు 1,24,576 ఓట్లతో గెలిపించారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని 1,90,328 ఓట్ల మెజార్టీతో కడప ఎంపీగా విజయం చేకూర్చారు. జమ్మలమడుగులో..: వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో  శివారెడ్డి కుటుంబానికి చెందిన రామసుబ్బారెడ్డి ఈ సారి పోటీలో ఉండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున ఎం.వీ. సుధీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

అవనిగడ్డలో  మండలి, సింహాద్రి
కృష్ణా జిల్లా అవనిగడ్డలో మండలి, సింహాద్రి కుటుంబాల రాజకీయ వారసత్వాలు కొనసాగుతూ వచ్చాయి. మండలి వెంకట కృష్ణారావు మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన ఒకసారి ఎంపీగా గెలిచి పీవీ నరసింహారావు మంత్రివర్గంలో పనిచేశారు. సింహాద్రి సత్యనారాయణ మూడుసార్లు గెలిచారు. సింహాద్రి రమేష్‌ గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. మండలి వెంకట కృష్ణారావు తనయుడు బుద్ధప్రసాద్‌ రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున, ఒకసారి టీడీపీ తరఫున విజయం సాధించారు. ఈసారి సింహాద్రి రమేష్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా, బుద్ధప్రసాద్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు.  
కోవూరులో నల్లపురెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు స్థానంలో నల్లపురెడ్డి కుటుంబానికి చెందిన  ప్రసన్నకుమార్‌రెడ్డి ఐదుసార్లు ఇక్కడినుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి గూడూరు, వెంకటగిరి, కోవూరులో ఐదుసార్లు గెలిచారు. ప్రస్తుతం ప్రసన్నకుమార్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒకసారి, రాపూరులో మూడుసార్లు, నెల్లూరులో ఒకసారి గెలిచారు. ఆనం సోదరుడు ఆనం వివేకానందరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరి తండ్రి ఆనం వెంకటరెడ్డి అదే కుటుంబానికి చెందిన ఆనం సంజీవరెడ్డి, అనం చెంచుసుబ్బారెడ్డి కూడా అసెంబ్లీకి ఎన్నికవ్వడమే కాకుండా మంత్రులుగా కూడా పనిచేశారు. ఆనం ప్రస్తుతం వెంకటగిరి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.


ఉదయగిరి: ఉదయగిరి మేకపాటి కుటుంబానికి పట్టుగొమ్మ. గత ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఓడిపోయినా ఆయన అంతకుముందు మూడుసార్లు ఇక్కడినుంచి గెలిచారు. ఒకసారి ఆయన సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపొందారు.  ఈసారి మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్‌సీపీ ఎంపీగా బరిలో ఉన్నారు. 

నరసరావుపేటలో కాసు..  కోడెల
గుంటూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి నరసరావుపేట నుంచి ఒకసారి, ఫిరంగిపురం నుంచి రెండుసార్లు గెలుపొందారు. ఉమ్మడి ఏపీకి ఏడున్నరేళ్లు సీఎంగా పనిచేశారు. బ్రహ్మానందరెడ్డి సోదరుడు వెంగళరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తనయుడు కాసు కృష్ణారెడ్డి మూడుసార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు ఇక్కడనుంచి ఐదుసార్లు గెలిచారు. కాసు మహేష్‌రెడ్డి ప్రస్తుతం గురజాల నుంచి పోటీ చేస్తుండగా, కోడెల సత్తెనపల్లి నుంచి పోటీచేస్తున్నారు.

బాపట్ల: సీనియర్‌ నేత పీసీసీ మాజీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావు ఇక్కడినుంచి మూడుసార్లు గెలవగా ఆయన కుమారుడు కోన రఘుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున 2014లో గెలిచారు. మళ్లీ ఇప్పుడు ఆయన అదే పార్టీ తరఫున మళ్లీ బరిలో నిలిచారు. 

‘ప్రకాశం’లో దగ్గుబాటి కుటుంబీకులే
ప్రకాశం జిల్లా పర్చూరులో ఎన్టీ రామారావు పెదల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాలుగుసార్లు, అంతకుముందు మార్టూరులో ఒకసారి మొత్తం ఐదుసార్లు గెలిచారు. 2014లో పోటీచేయని ఆయన ఈసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లోక్‌సభకు ఒకసారి, రాజ్యసభకు ఒకసారి ఎన్నికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement