పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినవన్నీ కాకి లెక్కలని తేలిపోయింది. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదు ..పేద రాష్ట్రం’ అని కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగ్ నివేదిక కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ లేదని కాగ్ స్పష్టం చేసిందని, తప్పుడు లెక్కలతో తెలంగాణను ధనిక రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై పొంగులేటి మండిపడ్డారు.
గారడీ లెక్కలతో ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రంగంలోను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మెరుగైన పాలన అందించలేదని విమర్శించారు. విద్య, వైద్యంలో ఎంతో పురోగతి సాధిస్తున్నామని గొప్పగా చెప్పుకునే టీఆర్‌ఎస్ నేతలు సర్కార్ వైద్యం డొల్లగా మారిందనీ, విద్యా వ్యవస్థ కుంటుపడిందన్న కాగ్ రిపోర్టుపై ఎందుకు నోరుమెదపడం లేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ రాజ్ చట్టానికి మార్పులు చేసి గ్రామ సభలకు కోరలు పీకారని ధ్వజమెత్తారు. ప్రయివేట్ యూనివర్సిటీలు తీసుకురావడమంటే కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో సాగుతున్న కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు గమనిస్తున్నారని పొంగులేటి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment