సాక్షి, కల్యాణదుర్గం : కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 13 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, టీడీపీ ఐదుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, సీపీఐ, జేఎన్‌పీ ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ దఫా కల్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండటమే. ఇక్కడ వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది.
చీకటి ఒప్పందంతో బరిలోకి ‘డమ్మీ’
ఏపీలో కాంగ్రెస్ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. దీంతో కనీసం పీసీసీ చీఫ్‌ను గెలిపించాలని చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ ఆయనను గెలిపిస్తే.. మిగిలిన చోట్ల తాము సహకరిస్తామన్నారు. దీంతో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పెద్దగా ఎవరికీ తెలియని తృతీయ శ్రేణి నేత ఉమామహేశ్వర్‌కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ ‘ఫ్యాన్’ హోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఏటికి ఎదురీదుతున్నారు.
కాంగ్రెస్, టీడీపీ సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలు తేటతెల్లం కావడంతో ఈ రెండు పార్టీలను ప్రజలు దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీకి ఈ పరిణామాలు మరింత కలిసొచ్చే అంశం.
ఆరోపణలు, విభేదాలతో టీడీపీ సతమతం
కల్యాణదుర్గం నుంచి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో 22,318 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గెలుపునకు ఈ మెజార్టీ దోహదపడింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చిన స్థానం ఇదే. ఈ ఎన్నికల్లో చౌదరికి టిక్కెట్ రాకుండా జేసీ దివాకర్‌రెడ్డి అడ్డుపడ్డారు. దీనికితోడు చౌదరి కుటుంబం అవినీతి విషయంలో రెచ్చిపోయింది.
విండ్ పవర్ భూముల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌కు పాల్పడింది. రైతుల నుంచి ఎకరా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకే భూములు కొనుగోలు చేసి.. అవే భూములను విండ్ పవర్ సంస్థకు రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షలకు విక్రయించారు. నియోజకవర్గంలో వేల ఎకరాల భూములను విండ్ పవర్ కోసం కంపెనీలు కొనుగోలు చేశాయి. రైల్వే కాంట్రాక్టుల్లో కూడా ఆయన కుటుంబం భారీగా లబ్ధి పొందింది.
నియోజకవర్గంలో జరిగిన పనులు, ఇతర కాంట్రాక్టుల్లో ఆ కుటుంబ సభ్యులు చేతులు పెట్టారు. ఈ పరిణామాలతో టీడీపీ ప్రతిష్ట బాగా దెబ్బతింది. దీనికి తోడు స్థానిక నేతలైన రామ్మోహన్ చౌదరి, నారాయణ, రమేశ్, మల్లికార్జున వంటి నాయకులు చౌదరికి టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారు. స్థానికులకే సీటివ్వాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఎస్‌ఆర్ కనస్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారం చేసుకోమని ఫోన్‌లో సూచించారు.
ఆ రెండు పార్టీలకూ ముప్పే
రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గం మడకశిర. పునర్విభజనలో భాగంగా 2009లో మడకశిర ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆయన కల్యాణదుర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో పెనుకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ తిరిగి కల్యాణ దుర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. టీడీపీ సహకారం లభిస్తుందని ఆశించినా.. మూడు దశాబ్దాల పాటు సైకిల్ గుర్తుకు ఓటేసిన ప్రజలు ఒక్కసారి హస్తానికి వేయాలంటే కుదరని పని. దీంతో టీడీపీ ఓట్లు రఘువీరా, ఉమామహేశ్వరావు చీల్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరి కూడా టీడీపీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది.
టీడీపీలో విభేదాలు.. వైఎస్సార్‌సీపీలో ఐక్యతా రాగం
టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరిని వ్యతిరేకించిన వారంతా ఉమామహేశ్వరరావుకు కూడా సహకారం అందించడం లేదు. స్థానికులకు సీటివ్వాలని తాము కోరితే స్థానికేతరులకు ఇచ్చారన్న అక్కసుతో పార్టీ శ్రేణులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిమి పాలైన తిప్పేస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డితోపాటు నేతలంతా ఉషాశ్రీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఇది వైఎస్సార్ సీపీకి లాభించే అంశం. మరోవైపు రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా గెలవాలనే తాపత్రయంతో బరిలో ఉన్న పీసీపీ చీఫ్‌కు వాతావరణం అనుకూలంగా లేదు.
ఓటర్ల వివరాలు
మొత్తం : 2,10,622
పురుషులు : 1,06,341
మహిళలు : 1,04,275
ఇతరులు: 06
– మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment