సాక్షి, హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న సొంత రాష్ట్రంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు గుర్తింపు లేకపోవడం దారుణమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ ఎంప్లాయీస్ యూని యన్ 17వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఎంప్లా యిస్ యూనియన్‌కు కనీసం గుర్తింపు ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
యూనియన్‌లో కొం దరు నేతలు పదవుల ప్రలోభాలకు లోనయ్యారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఎన్నో ధర్నా లు, సమ్మెలు, నిరసనలు చేసి, జీతాలు కోల్పోయి తెలంగాణ సాధిస్తే.. ఆ పునాదులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్, ఉద్యోగులనే విస్మరించారని తీవ్రంగా మండిపడ్డారు. కనీస డిమాండ్లయిన వేతన సవరణ, మధ్యంతర భృతిని చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి అహర్నిశలు శ్రమిస్తోన్న ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోగా, కొత్త జిల్లాలు ఏర్పడినప్పటి నుంచి హెచ్‌ఆర్‌ను 20 నుంచి 12.5 శాతానికి ఎలా తగ్గిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త పోస్టులు భర్తీ చేయకుండా ఉద్యోగులపై పనిఒత్తిడి పెంచడాన్ని ఆక్షేపించారు. సీపీఎస్‌పై అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూటమి’ద్వారా తాము అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని, వేతన సవరణ, మధ్యంతర భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రలో పని చేస్తోన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తీసుకొస్తామన్నారు.
ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదు...
అపాయింట్‌మెంట్లు ఇవ్వని సీఎంను తన రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదని ఉత్తమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగులను కలవని సీఎం గా పేరు తెచ్చుకున్న ఘనత కేసీఆర్‌దే అని చురకలంటించారు. 9 ఎకరాల్లో నగరం నడిబొడ్డున రూ.100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని. కుటుంబమంతా చార్టెర్డ్ విమానంలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు.
పోలీసుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. ఈ రోజు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం కాకుండా కొందరి కోసం పనిచేస్తే.. భవిష్యత్‌లో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని పాలిస్తున్న కేసీఆర్‌ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
వారిని వెనక్కి తీసుకురావాలి....
ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులు అభద్రతాభావం, ఆందోళన, ఒత్తిడి నడుమ పనిచేయాల్సిన దుస్థితి దాపురించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఉద్యోగి, ఉద్యోగ సంఘ నాయకుడు స్వేచ్ఛగా ఫోన్లోనైనా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. అందుకే, ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్‌సీ, ఐఆర్ ఇవ్వలేకపోయారన్నారు.
ఈ వాస్తవాలు బయటపడతాయన్న భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లాడని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ ఇలాగే కొనసాగితే.. భవిష్యతు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రలో పనిచేసే ఉద్యోగులను వెంటనే వెనక్కి తీసుకురావాలన్న తమ డిమాండ్‌ను కేసీఆర్ నాలుగేళ్లుగా తన టేబుల్‌పైనే ఉంచుకున్నారన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ రెగ్యులరైజ్, ఖాళీల భర్తీ, ఉద్యోగులకు ఇళ్లస్థలాల పంపిణీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులంతా విస్తృతంగా ప్రచారం చేసి, ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
భజనపరుల తెలంగాణ...
1953 ముల్కీ ఉద్యమం నుంచి 2014 ఉద్యమం దాకా ఎందరో పాల్గొన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కానీ, ఈ రోజు కేసీఆర్ కుటుంబమే ఆ ఫలాలను అనుభవిస్తోందని ఆరోపించారు. నిజాం నుంచి నిన్నటి ఆంధ్ర పాలకుల దాకా అన్ని వర్గాల మీద పోరాడిన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. అసలైన తెలంగాణ ఉద్యమ కారులను పక్కనబెట్టి, భజనపరులకు పదవులు కట్టబెట్టి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తేసి తెలంగాణలో నిరసన స్వరాన్ని తొక్కిపెట్టారని, హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని అన్నారు.
సచివాలయానికి రాని సీఎం
ఉద్యోగుల ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో వారిని పట్టించుకోకపోవడం అన్యాయమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అటెండర్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్‌ల దాకా సభ్యులుగా ఉన్న ఈ సంఘానికి నేటికీ గుర్తింపు రాకపోవడం అప్రజాస్వామికం అని దుయ్యబట్టారు. నాలుగేళ్లు కేసీఆర్ నియంతృత్వ ధోరణిలో పాలన సాగించాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు కనీస గుర్తింపు లేదని, కేబినెట్‌లో స్థానం కల్పించకపోవడమే దీనికి నిదర్శనం అని మండిపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ యువశక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీరుద్రమ, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నేతలు సంపత్‌కుమార్, నిర్మల, భుజంగరావు తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment