న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌమిత్రా ఖాన్ బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన తరువాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదని, పోలీసు రాజ్యం నడుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ మార్పు తెస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం విష్ణుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సౌమిత్రా ఖాన్ పార్టీని వీడడాన్ని తృణమూల్ తక్కువచేసి చూపే ప్రయత్నం చేసింది. ఆయన్ని ఇది వరకే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. సౌమిత్రా ఖాన్ చాన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కదన్న సంగతి ఆయనకు కూడా తెలుసని వెల్లడించింది. తాజా పరిణామంపై బీజేపీ స్పందిస్తూ.. బెంగాల్‌లో తృణమూల్ పతనం ప్రారంభమైందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment