
సౌతాంప్టన్ : కరోనా విరామం తర్వాత ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌తో క్రికెట్ సందడి షురూ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భౌతిక దూరం పాటిస్తూనే సహచర ఆటగాళ్లతో కేవలం భూజాలతోనే విషెస్ చెప్పడం చూశాం. అండర్సన్ చేసిన పని క్రికెట్ అభిమానులకు తెగ నచ్చేసింది. అలాగే ఇతర క్రికెటర్లు కూడా ఈ విధంగా పాటిస్తే బాగుంటుందని ఐసీసీ పేర్కొంది.(అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి)
అలా అందరిచేత మెప్పించబడ్డ అండర్సన్ తాజాగా సౌతాంప్టన్లో వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ 3వరోజు ఆటలో భాగంగా ఐసీసీ నిబంధనలను గాలికొదిలేశాడు. రోస్టన్ చేజ్ వికెట్ తీసిన ఆనందంలో కనీస భౌతిక దూరం పాటించకుండా సహచరుల వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నాడు. అండర్సన్ వేసిన బంతి చేజ్ మొకాళ్లకు తాకుతూ వెళ్లింది. దాంతో అండర్సన్ ఎల్బీ అప్పీల్‌కు వెళ్లగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కెప్టెన్ స్టోక్స్ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. డీఆర్ఎస్ రివ్యూ ఇంగ్లండ్‌కు అనుకూలంగా రావడంతో ఆ సంతోషంలో అండర్సన్ తన సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లి ఆనందంతో హత్తుకున్నాడు.('నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు')
Jimmy makes the breakthrough! 👏
— England Cricket (@englandcricket) July 10, 2020
Scorecard & Videos: https://t.co/ldtEXLDT8V#ENGvWI pic.twitter.com/rtzmfzV8WS
'అండర్సన్.. మొన్ననే కదా నిన్ను మెచ్చుకుంది.. ఇంతలోనే ఐసీసీ నిబంధనలు గాలికొదిలేస్తావా' అంటూ ఐసీసీ తన ట్విటర్‌లో పేర్కొంది. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ స్పందించాడు. 'వికెట్ తీశానన్న ఆనందంలో అలా చేసి ఉంటాడు. ఎంతైనా పాత పద్దతులు అంత తొందరగా జీర్ణం కావుగా' అంటూ తెలిపాడు.
కాగా తొలి టెస్టులో ఇప్పటివరకైతే విండీస్‌దే పైచేయిగా నిలిచింది. మూడోరోజూ ఆతిథ్య ఇంగ్లండ్ బౌలర్లపై బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో విండీస్ ఆధిక్యం దక్కింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), వికెట్ కీపర్ డౌరిచ్ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 318 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 114 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/49), అండర్సన్ (3/62) ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి గండికొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. బర్న్స్ 10 పరుగులతో, సిబ్లీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 99 పరుగుల వెనుకంజలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment