బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో బౌలర్లదే కీలక పాత్రగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. తొలుత భారీగా పరుగులిచ్చిన బౌలర్లు, ఆపై ఇంగ్లండ్‌ను కట్టడి చేయడాన్ని అసాధారణ ప్రదర్శనగా కోహ్లి అభివర్ణించాడు. ప్రధానంగా తొలి పది ఓవర్లు ముగిసిన తర్వాత టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ..‘ ఇంగ్లండ్ మొదటి పది ఓవర్ల ఆట మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. అదే ఊపును వారు కడవరకూ కొనసాగించి ఉంటే 225-230 పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచేవారు.
ఒకవేళ ఇదే స్కోరును ఇంగ్లండ్ నమోదు చేసి ఉంటే మా గెలుపు కష్టమయ్యేది. కాకపోతే మా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ను కట్టడి చేయడం కచ్చితంగా అభినందనీయం. ఇక్కడ మా బౌలింగ్‌లో నాణ్యత కొట్టొచ్చినట్లు కనబడింది. వికెట్ టేకింగ్ బంతులతో ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. ప్రధానంగా హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్న తీరు అద్భుతం. అతనొక మంచి ఆల్ రౌండర్ అనే విషయాన్ని హార్దిక్ మరోసారి నిరూపించుకున్నాడు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో మెరిసి విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతో మా బ్యాట్స్‌మన్ ఎంజాయ్ చేస్తూ పరుగులు చేశారు. దాంతోనే దాదాపు 200 పరుగుల లక్ష్యాన్ని ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగా ఛేదించాం’ అని కోహ్లి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment