
ఢిల్లీ: ప్రస్తుత క్రికెట్‌లో ఎవరు మేటి అంటే తన వద్ద సమాధానం లేదని భారత మాజీ ఆల్‌రౌండర్ అజయ్ జడేజా పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో పరుగుల వరద సృష్టిస్తున్న ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిల్లో ‘గ్రేటెస్ట్’ ఎవరు అనే దానిపై జడేజా తనదైన శైలిలో సమాధాన ఇచ్చాడు. ఈ ఇద్దర్నీ పోల్చడం కష్టంతో కూడుకున్న పని అని, అదొక మారథాన్ రేస్ లాంటిదన్నాడు. కొన్ని సందర్భాల్లో ఒకరు పైచేయి సాధిస్తే, మరికొన్ని సార్లు మరొకరు ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారన్నాడు. దాంతో వీరిలో ఎవరు గొప్ప అంటే చెప్పలేని స్పష్టం చేశాడు.
ఢిల్లీ మరియు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్వహించిన ఒక ఈవెంట్‌కు హాజరైన జడేజా.. కోహ్లి, స్మిత్‌ల గురించి మాట్లాడాడు. ‘ నాకు కచ్చితంగా తెలీదు వారిద్దరిలో ఎవరు మేటి అనే విషయం. ఇద్దరూ ఒకే శకంలో క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్‌ను ఎక్కువగా ప్రేమిస్తూ పరుగుల దాహం తీర్చుకుంటున్నారు. వీరిద్దరిలో విజేత ఎవరంటే చాలా కష్టం. అది ఒక మారథాన్ రేసు మాత్రమే. ప్రజలు కూర్చొని ఈ రేసును ఎంజాయ్ చేస్తూ ఎవరు గొప్ప అనేది నిర్ణయించాలి’ అని జడేజా పేర్కొన్నాడు.