'అండర్సన్ ను ఎంపిక చేయాల్సింది'
లండన్: మరో రెండు రోజుల్లో పాకిస్తాన్ తో ఆరంభం కానున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ లేకపోవడం పట్ల సహచర బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ నిరాశ వ్యక్తం చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో అండర్సన్ గాయపడినప్పటికీ, ప్రస్తుతం అతను బాగానే ఉండటం వల్ల పాకిస్తాన్ తో జరిగే మొదటి టెస్టు స్క్వాడ్ లో చోటు కల్పించాల్సిందని బ్రాడ్ తెలిపాడు.
' గత వారం అండర్సన్ కలిశా. అతను ఫిట్ నెస్ పరంగా బాగానే ఉన్నాడు. జిమ్మీ ఉంటే నాకు ఒక బలం. కానీ అండర్సన్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అండర్సన్ కు నేను చెప్పలేదు. జట్టులో ఎంపిక కాలేదని తెలిస్తే జిమ్మీ నిరాశకు గురౌతాడు' అని బ్రాడ్ తెలిపాడు.
అండర్సన్ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని భావించే అతనికి సెలక్టర్లు తొలి టెస్టులో విశ్రాంతి కల్పించి ఉంటారనుకుంటున్నట్లు అండర్సన్ అన్నాడు. ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు(454) సాధించి ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్ గా ఉన్న అండర్సన్ రెండో టెస్టు నాటికి అందుబాటులోకి వస్తాడని బ్రాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య తొలి టెస్టు జూలై 14వ తేదీన లార్డ్స్ లో ఆరంభం కానుంది.