జీతూరాయ్ కు కాంస్యం
న్యూఢిల్లీ:అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య(ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్ లో భారత్ షూటర్ జీతూరాయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో జీతూరాయ్ మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని సాధించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జీతూరాయ్ 216.7 పాయింట్లతో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఈవెంట్ తొలి కాంపిటేషన్ రౌండ్ ముగిసిన తరువాత ఏడో స్థానంలో నిలిచిన జీతూరాయ్.. ఆ తరువాత సత్తా చాటుకుంటూ క్రమేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. రజత పతకాన్ని సాధించడానికి జీతూరాయ్ తీవ్రంగా యత్నించినప్పటికీ సాధ్యపడలేదు.
ఇందులో జపాన్ కు చెందని తముయుకి మత్సుద 240.1 పాయింట్లతో పసిడిని సాధించగా, వియత్నాంకు చెందిన విన్హ హాంగ్ 236.6 పాయింట్లతో రజతం సాధించాడు.
జీతూరాయ్ తాజా పతకంతో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.అంతకుముందు జీతూరాయ్-హీనా సిద్ధూ జోడి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ లో పసిడి సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అంకుర్ మిట్టల్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించాడు.