సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో జమ చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధికసార్లు 150 పరుగులు సాధించిన కెప్టెన్ గా నిలిచాడు. సౌతాఫ్రికాతో సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అతను ఈ ఘనతను సాధించాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్(8 సెంచరీలు) సరసన కోహ్లి నిలిచాడు.
ఇంతకు ముందు ఈ జాబితాలో ఏడేసి సెంచరీలతో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ , శ్రీలంక మాజీ ఆటగాడు మహేలా జయవర్దనే, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, సౌతాఫ్రికా తరపున గ్రేమ్ స్మిత్ ఉన్నారు. ఇక సఫారీ గడ్డపై ఆసియా దేశాలకు చెందిన కెప్టెన్ సెంచరీ చేయటం ఇది రెండోసారి. గతంలో సచిన్ టెండూల్కర్(1997 కెప్‌టౌన్ టెస్టులో 169పరుగులు) ఈ ఘనత సాధించారు. కోహ్లి 150 పరుగులు సాధించటం ఇది తొమ్మిదోసారి.
రెండో టెస్ట్ మూడోరోజు దూకుడుగా ఆడిన కోహ్లి 153 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఓవైపు జట్టు సభ్యులంతా విఫలమై పెవిలియన్ చేరుతుంటే కోహ్లి మాత్రం పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో తన 21 సెంచరీని సాధించి మరో రికార్డును కైవసం చేసుకున్నాడు. టీమిండియా సాధించిన మొత్తం 307 పరుగుల్లో కోహ్లి పరుగులే సగం ఉండటం విశేషం. మొదటి ఇన్నింగ్స్‌లో 335 పరుగులు సాధించిన సౌతాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment