ఐపీఎల్-2? | New ipl team ... and its name IPL-2 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-2?

Published Mon, Jun 1 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

ఐపీఎల్-2?

ఐపీఎల్-2?

మరో లీగ్ ఆలోచనలో బీసీసీఐ
విధివిధానాలపై కసరత్తు

 
 ప్రస్తుతం బీసీసీఐ ఆలోచనలు చూస్తే త్వరలో విజయవాడ విన్నర్స్ అనో వైజాగ్ హీరోస్ అనో కొత్త ఐపీఎల్ జట్టును చూడొచ్చు. చాంపియన్స్ లీగ్ రద్దు చేసే ఆలోచనలో ఉన్న బోర్డు ఆ స్థానంలో కొత్త లీగ్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఉన్న ఐపీఎల్ జట్లతో ఓ మినీ టోర్నీ నిర్వహించడమా లేక కొత్త జట్లతో ఐపీఎల్-2 ప్రారంభించడమా అనే ప్రతిపాదనలతో చర్చలు జరుగుతున్నాయి.
 
 సాక్షి క్రీడావిభాగం : చాంపియన్స్ లీగ్ టి20 ద్వారా తమకు ఏ మాత్రం లాభాల్లేవంటూ ఆ లీగ్ ప్రసారకర్త చేతులెత్తేసింది. ఆరేళ్లుగా ప్రతి సెప్టెంబరు-అక్టోబరులో ఈ లీగ్ కోసం ఐసీసీ ఏకంగా ఓ విండో ఏర్పాటు చేసింది. ఈ సమయాన్ని ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదించడంపై ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టింది. క్రికెట్‌కు దేశంలో ఉన్న ఆదరణ, ఐపీఎల్‌కు పోటెత్తుతున్న అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఓ టి20 లీగ్‌ను నిర్వహించాలనే ప్రతిపాదనతో ఉంది. చాంపియన్స్ లీగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల ఉమ్మడి ఆస్తి. ఇందులో వచ్చిన లాభాలను అందరూ పంచుకుంటారు. అయితే ఐపీఎల్‌కు కొనసాగింపుగా మరో టోర్నీ తెస్తే పూర్తి లాభాలు భారత్‌కే దక్కుతాయి. ఈ నేపథ్యంలో బోర్డు పెద్దలు రెండు ప్రతిపాదనలను చర్చిస్తున్నారు.
 
 ప్రతిపాదన 1:  4 జట్లతో యూఏఈలో టోర్నీ
 గత ఏడాది ఎన్నికల కారణంగా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించారు. అక్కడ అభిమానులు భారీగా స్టేడియాలకు వచ్చారు. దీంతో బీసీసీఐకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ఏడాది చాంపియన్స్ లీగ్ బదులుగా మినీ ఐపీఎల్‌ను ఏర్పాటు చేసి దానిని యూఏఈలో నిర్వహించాలనే ఓ ప్రతిపాదన ఉంది. ఈ సీజన్ ఐపీఎల్‌లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లతో ఈ లీగ్ ఆడించాలని భావిస్తున్నారు. అయితే ఈ ఫార్మాట్‌లో ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌తో కలిపి 13 మ్యాచ్‌లు మాత్రమే వస్తాయి. కాబట్టి టోర్నీ మరీ చిన్నగా అయిపోతుంది. ప్రసారకర్తలు దీనిని ఒప్పుకోకపోవచ్చు.
 
 ప్రతిపాదన 2: చిన్న నగరాల్లో కొత్త జట్లతో టోర్నీ
 ఈ సీజన్‌లో ఐపీఎల్ కౌన్సిల్ కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు సూపర్ హిట్ అయ్యాయి. చిన్న పట్టణాల్లోని మైదానాల్లో స్క్రీన్‌లు ఏర్పాటు చేసి మ్యాచ్‌లు చూపించారు. గుంటూరులో 30 వేల మంది వచ్చారని కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఆదరణ బీసీసీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాలలో మ్యాచ్‌లను నిర్వహించినా అభిమానులు వస్తారనే నమ్మకం పెరిగింది. దీంతో చిన్న నగరాల నుంచి జట్లను తీసుకుని ఐపీఎల్-2ని కొత్త జట్లతో నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. అహ్మదాబాద్, విజయవాడ, భోపాల్ లాంటి నగరాలతో కొత్త జట్లను తయారు చేస్తారు. ఇందులో బాగా ఆడిన రెండు జట్లను ఐపీఎల్-1కు ప్రమోట్ చేయడం... అలాగే ఐపీఎల్-1లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లను తర్వాతి సీజన్‌లో ఐపీఎల్-2కి పంపడం వల్ల రెండు లీగ్‌లను హిట్ చేయొచ్చనేది ఆలోచన.
 
 ప్రతిపాదన-2 వల్ల కొంత సమస్య కూడా ఉంది. ఐపీఎల్-1 ద్వారా దాదాపు ప్రధాన క్రికెటర్లంతా బిజీగా ఉన్నారు. మరి ఐపీఎల్-2కి క్రికెటర్లు ఎలా? పేరు లేని క్రికెటర్లను రంజీ స్టార్స్‌ని తెచ్చి ఆడిస్తే ప్రేక్షకులు రారు. ప్రేక్షకులు లేకపోతే టీవీ ప్రసారకర్తలు ఆసక్తి చూపించరు. ఈ సమస్యను అధిగమించడం గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. 2017తో ఐపీఎల్ జట్ల కాంట్రాక్టులు ముగుస్తాయి. ఇప్పుడు ఉన్న 8 జట్లతోఒప్పందం పూర్తవుతుంది.

మళ్లీ జట్ల కోసం బిడ్డింగ్‌కు వెళతారా? లేక ఇప్పుడున్న ఓనర్లకే కొనసాగింపు ఇస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ మళ్లీ బిడ్డింగ్‌కు వెళితే 16 నగరాల నుంచి 16 జట్లకు బిడ్డింగ్ కోరవచ్చు. అప్పుడు రెండు లీగ్‌లకు కలిపి ఆటగాళ్ల వేలం నిర్వహించొచ్చు. ఏమైనా ఇంకా ఈ టోర్నీలపై చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయి. ఒకట్రెండు నెలల్లో కొత్త లీగ్ గురించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement