సైనా శుభారంభం | Saina Nehwal, Kashyap Advance; PV Sindhu Ousted From Indonesian Open | Sakshi
Sakshi News home page

సైనా శుభారంభం

Published Thu, Jun 4 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

సైనా శుభారంభం

సైనా శుభారంభం

జకార్తా (ఇండోనేసియా): గతంలో తనకెంతో కలిసొచ్చిన ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. సైనాతోపాటు శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. అయితే పి.వి.సింధుకు మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ సైనా 21-16, 21-18తో నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది.
 
 మరో మ్యాచ్‌లో సింధు 21-16, 15-21, 14-21తో యా చింగ్ సు (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. ఒకవేళ సింధు ఈ మ్యాచ్‌లో గెలిచిఉంటే ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా ఎదురయ్యేది. సింధు ఓటమితో ప్రిక్వార్టర్ ఫైనల్లో యా చింగ్ సుతో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కశ్యప్ 21-17, 21-7తో తనోంగ్‌సక్ సేన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... శ్రీకాంత్ 11-21, 21-14, 24-22తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)ను ఓడించాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒక మ్యాచ్ పాయింట్ కాపాడుకొని నెగ్గడం విశేషం.
 
 పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం 13-21, 11-21తో లీ షెంగ్ ము-త్సాయ్ చియా సిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21-17, 19-21, 21-11తో సు యా చింగ్-పాయ్ యు పో (చైనీస్ తైపీ) ద్వయంపై గెలుపొందింది.
 ఇండోనేసియా ఓపెన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement