ఆసీస్ ప్రతీకార విజయం
రెండో వన్డేలో కివీస్ చిత్తు
వెల్లింగ్టన్: తొలి వన్డేలో ఎదురైన ఓటమికి ఆస్ట్రేలియా జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఓపెనర్ వార్నర్ (79 బం తుల్లో 98; 8 ఫోర్లు; 4 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (72 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) చెలరేగడంతో న్యూజి లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణాయక చివరి వన్డే సోమవారం హామిల్టన్‌లో జరుగుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 281 పరుగులు చేసింది.
కేన్ విలియమ్సన్ (74 బంతుల్లో 60; 5 ఫోర్లు; 1 సిక్స్), సాన్‌ట్నర్ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు; 1 సిక్స్), మిల్నే (27 బంతుల్లో 36; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆసీస్ 46.3 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసి నెగ్గింది. సహచర ఓపెనర్ ఖవాజా (49 బంతుల్లో 50; 7 ఫోర్లు)తో కలిసి వార్నర్ తొలి వికెట్‌కు 122 పరుగులు జత చేశాడు. అయితే మరో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడింది. అయితే హేస్టింగ్స్ (48 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్), మార్ష్ నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.