నేటి నుంచి రియో ఒలింపిక్స్
ఆగస్టు 5 నుంచి 21 వరకు
* ప్రారంభోత్సవం భారత కాలమానం ప్రకారం శనివారం
* తెల్లవారుజామున గం. 4.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
నాలుగేళ్ల కష్టాన్ని మైదానంలో చూపించే అథ్లెట్లు... కళ్లు చెదిరే విన్యాసాలతో అలరించే జిమ్నాస్ట్‌లు... ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, పతకం సాధించాలనే పట్టుదలతో పోరాడే క్రీడాకారులు... ఇదంతా ఓ వైపు. అగ్రరాజ్యమైనా, శరణార్థ అథ్లెట్ అయినా అందరి లక్ష్యం ఒక్కటే... ఒలింపిక్ పతకం. తమ కలను సాకారం చేసుకోవడానికి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్లు రియోకు చేరారు. అంగరంగ వైభవంగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంతో ఒలింపిక్స్‌కు తెరలేవనుంది. బోల్ట్, ఫెల్ప్స్‌లాంటి దిగ్గజ అథ్లెట్ల మెరుపులతో రియో వెలిగిపోనుంది.
అమెరికానుంచి అజర్ బైజాన్ వరకు, ఆస్ట్రేలియా నుంచి అర్మేనియా వరకు... అగ్ర దేశమైనా, ఆకలి రాజ్యమైనా ఇప్పుడు అందరిదీ ఒకటే ఆట, ఒకటే భాష... తుపాకుల మోతలు లేవు, అంతర్యుద్ధం మాట వినిపించదు, కానీ సమరానికి మాత్రం లోటు లేదు... అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, శరణార్థి శిబిరం నుంచి వచ్చిన అథ్లెట్ కావచ్చు, ప్రత్యర్థిపై పైచేయి సాధించి విజయగర్వంతో చేసే సింహనాదంలో తేడా ఉండదు.
బరిలో అడుగు పెడితే చాలు గుండెల నిండా ఉద్వేగంతో, జాతీయ జెండాను మనసులో నింపుకునే అథ్లెట్లు ఈ అరుదైన క్షణం కోసం అహరహం శ్రమిస్తారు. సత్తా చాటి మెడల్ గెలిచిననాడు పోడియం వైపు నడిచే ప్రతీ అడుగు అతడికి జీవిత కాలపు ఆనందాన్ని ఇస్తుంది. పతకాల పంట పండించకపోయినా పర్వాలేదు, ప్రపంచ క్రీడా సంబరంలో తానూ భాగమయ్యానన్న సంతోషం ప్రతీ ఆటగాడి బయోడేటాలో ప్రథమాక్షరిగా కనిపిస్తుంది.
కూబర్టీన్ కలల్లోంచి పుట్టి 120 ఏళ్లుగా క్రీడాకారుల గుండె చప్పుడుగా మారిన ఒలింపిక్స్ మళ్లీ వచ్చేశాయి. సమరాంగణాన నాతో సరితూగేవారెవ్వరు అంటూ అథ్లెట్లు సవాల్ విసిరే సమయం ఆసన్నమైంది. కొందరు బంగారంతో తళుక్కుమంటే, మరి కొందరికి వెండి వెలుగులే ముంజేతి స్వర్ణ కంకణంలా మారిపోతాయి. మరి కొందరికి కంచు మోతలో కూడా మాధుర్యం వినిపిస్తుంది. రియోలో విశ్వ రూపం చూపించేందుకు స్టార్లు సిద్ధమైన వేళ... ఈ పక్షం రోజులు ప్రతీ క్రీడాభిమానికి పండగే.
1908 లండన్ గేమ్స్‌లో తొలిసారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. నాటినుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. ఏ ఒలింపిక్స్‌లోనైనా మార్చ్ పాస్ట్‌లో ముందుగా గ్రీస్ జట్టు... ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం వరుసలో వేర్వేరు దేశాలు వస్తాయి. అందరికంటే చివరలో ఆతిథ్య దేశం క్రీడాకారులు నడుస్తారు.
క్రీడా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న అతి పెద్ద సంబరం ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. 31వ ఒలింపిక్ క్రీడలు నేటినుంచి బ్రెజిల్ నగరం రియో డి జనీరోలో జరగనున్నాయి. ఇక్కడి చారిత్రక మరకానా స్టేడియంలో శుక్రవారం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రెజిల్ గర్వప్రదాత, ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగిస్తారు. మొత్తం మూడున్నర గంటల పాటు ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ‘ది ఎవల్యూషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బ్రెజిల్’ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ దేశపు అత్యుత్తమ గాయకులు పాడే పలు గీతాలతో పాటు దెబోరా కోల్కర్ నేతృత్వంలో 6 వేల మందితో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఉంటుంది.
శనివారంనుంచి వివిధ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 17 రోజుల క్రీడోత్సవానికి ఈ నెల 21న మరకానాలోనే ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తారు. బ్రెజిల్ దేశపు ఆర్థిక సంక్షోభం, రియోలో పూర్తి కాని ఏర్పాట్లు, నిరసనకారుల ప్రదర్శనలు, రష్యా ఆటగాళ్లపై నిషేధం, క్రీడా గ్రామంలో సౌకర్యాల లేమి, దోపిడీలు, జికా వైరస్ ప్రభావం... ఇలా చాలా అంశాలు ఇప్పటి వరకు రియో ఒలింపిక్స్‌లో క్రీడలకంటే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. అయితే ఒక్క సారి పోటీలు మొదలైతే ఇదంతా సద్దుమణిగినట్లే. ఆటగాళ్ల ఏకైక లక్ష్యం విజయం సాధించడం, పతకం దక్కే వరకు పట్టుదలతో పోరాడటమే. సూపర్ స్టార్లుగా ఉన్నవారు మరో మెట్టు ఎదిగేందుకు, కొత్త స్టార్లు పుట్టుకొచ్చేందుకు అసలైన వేదిక అయిన ఒలింపిక్స్... కొత్త రికార్డులు, ఘనతలతో ‘మరింత వేగంగా, మరింత ఎత్తుకు, మరింత బలంగా...’ దూసుకుపోవాలని క్రీడా ప్రపంచం కోరుకుంటోంది.
8 వేల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా టీవీ ప్రసార హక్కుల కోసం ఎన్‌బీసీ యూనివర్సల్ చెల్లించిన మొత్తం
3,200 క్రీడల నిర్వహణకు రిఫరీలు, సహాయకులు
4,924 అందుబాటులో ఉన్న మొత్తం పతకాలు
77 వేల కోట్లు సుమారుగా రియో ఒలింపిక్స్ మొత్తం ఖర్చు
14 ఒకే అథ్లెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు
555 అమెరికా అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్న ఆటగాళ్లు
రియోలో భారతీయం
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే భారత ఆర్చరీ జట్టు నేడు (శుక్రవారం) బరిలోకి దిగబోతోంది. పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ ఈవెంట్‌లో అతాను దాస్, మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ ఈవెంట్‌లో లక్ష్మీరాణి, బొంబేలా దేవి, దీపికా కుమారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక మహిళల టీమ్ ర్యాంకింగ్ రౌండ్‌లో లక్ష్మీరాణి, బొంబేలా దేవి, దీపికా కుమారి జట్టుగా పాల్గొంటున్నారు.
ఒలింపిక్స్‌కు ముందు భారత అభిమానులకు చేదు వార్త. టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో కలిసి ఆడాల్సిన పేస్-బోపన్న రియోలో విడిగా బసచేశారు. ఈ ఇద్దరూ కనీసం మొహాలు కూడా చూసుకోవడం లేదని సమాచారం.