అచ్చమిండ్రిగా మారిన శిఖండి
శిఖండి పేరుతో తెరకెక్కనున్న కొత్త చిత్రం పేరు అచ్చమిండ్రిగా మార్చారు. చెన్నై 28 చిత్రం ద్వారా పరిచయమైన నటుడు విజయ్ వసంత్ ఆ చిత్రం తర్వాత సోలో హీరోగా నటించిన కొన్ని చిత్రాలు ఆయనకు ఏ సక్సెస్‌ను ఇవ్వలేదు. దీంతో సోదరుడు వినోద్‌కుమార్ నిర్మాతగా, తాను హీరోగా నటించిన ఎన్నమోనడకుదు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు రాజ పాండితో మళ్లీ చిత్రం చేయడానికి విజయ్ వసంత్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి మొదట శిఖండి అన్న పేరును అనుకున్నారు. తాజాగా అచ్చమిండ్రి పేరును నిర్ణయించారు. మేఘా, డార్లింగ్, ఎనకుల్ ఒరువన్‌చిత్రాల నటి సృష్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారు. హాస్య నటుడు ప్రేమ్‌జీ అమరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగింది.
వసంత్ అండ్ కో అధినేత వసంతకుమార్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు రాజ పాండి తెలుపుతూ, విద్యా విధానంలో జరుగుతున్న అనేక అవకతవకలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో జరిగే హత్యలు, అవినీతి లాంటి విషయాలను వెలికి తీసి కథాంశంతో అచ్చమిండ్రి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. తొలి షెడ్యూల్‌ను 20 రోజుల పాటుగా చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించి, పాటలను విదేశాల్లో చిత్రీకరించినట్టు తెలిపారు.